కలెక్టర్ నిశాంతి
సాక్షి, పాడేరు: విద్యతోనే పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఏర్పడుతుందని, తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని జిల్లా కలెక్టర్ టి. నిశాంతి అన్నారు.
శుక్రవారం స్థానిక తలారిసింగి బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ సమావేశం లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తల్లిదండ్రులంతా తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించి వారి విద్యాభివృద్ధికి సహకరించాలని కోరారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ముచ్చటించి పాఠశాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
సీఎస్సార్ నిధులు రూ.3 కోట్లు..
తలారిసింగి ఆశ్రమ పాఠశాలలో భవన నిర్మాణాల కోసం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సీఎస్‌ఆర్ నిధుల నుంచి రూ.3 కోట్లను విరాళంగా అందించనున్నట్లు ఉమ్మడి విశాఖ బీసీ సంక్షేమశాఖ అధికారి టి. కృష్ణవేణి ప్రకటించారు. ఇంత పెద్ద మొత్తంలో సీఎస్‌ఆర్ నిధులు మంజూరు చేయడంపై కలెక్టర్ నిశాంతి ఆమెను అభినందించి దుశ్శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఈవో పరిమళ, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


