కాఫీ రైతుకు
● వెంటాడుతున్న స్టెమ్ బోరర్
● గొందికోడాపుట్టులో పురుగు తీవ్రత
● తొలగిస్తున్న రైతులు
● స్పందించని అధికారులు
ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడుకున్న కాఫీ తోటలు..
ఇప్పుడు కాండం తొలిచే పురుగు బారిన పడుతున్నాయి. పెదబయలు మండలం అడుగులపుట్టు
పంచాయతీలో పురుగుల ఉధృతికి
వందలాది మొక్కలు అంతమవుతుండటంతో గిరిజన రైతులు ఆందోళన
చెందుతున్నారు.
పెదబయలు: జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఎంతో శ్రమటోడ్చి సాగు చేస్తున్న కాఫీ తోటలను స్టెమ్ బోరర్ (కాండం తొలిచే పురుగు) ఆశించి రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం కాఫీ గింజలు పిందె దశలో ఉండి, కాపు ఆశాజనకంగా రావడంతో రైతులు సంతోషంగా ఉన్న తరుణంలో, ఈ పురుగుల ఉధృతి వారిని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
ఆందోళనలో రైతులు..
మండలంలోని అడుగులపుట్టు పంచాయతీ, గొందికోడాపుట్టు గ్రామానికి చెందిన పోయిభ కృష్ణారావు వంటి ఎంతోమంది రైతుల తోటల్లో ఈ పురుగుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సుమారు 50 నుంచి 100 వరకు కాఫీ మొక్కల మొదళ్లు, మధ్య భాగాల్లోని కాండాన్ని ఈ పురుగులు తొలిచేస్తున్నాయి. పురుగు ఆశించిన 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే చెట్లు పూర్తిగా ఎండిపోయి చనిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కల ప్రధాన కాండంపై రంధ్రాలు ఏర్పడి, లోపలి భాగం గుల్లబారిపోవడంతో, ఆకులు పసుపు రంగులోకి మారి క్రమంగా చెట్టు వాడిపోతోంది.
కోలుకోలేని దెబ్బ
ఏళ్ల తరబడి కంటికి రెప్పలా కాపాడుకుంటూ, ఎంతో పెట్టుబడి పెట్టి పెంచుకున్న కాఫీ మొక్కలు ఇలా కళ్లముందే నశిస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ ఒక్క గ్రామంలోనే సుమారు 20 గిరిజన కుటుంబాలు కాఫీ సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని తోటల్లో వేల సంఖ్యలో మొక్కలు దెబ్బతినగా, సకాలంలో వీటిని నివారించకపోతే ఆ ప్రభావం తోట మొత్తానికి విస్తరించి, తమకు ఆర్థికంగా కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని రైతులు భయపడుతున్నారు.
నివారణపై చొరవ అవసరం
ఈ సమస్యపై స్థానిక ఉద్యానవన శాఖ, కాఫీ బోర్డు అధికారులు వెంటనే స్పందించాలని రైతులు కోరుతున్నారు. పురుగు ఉధృతిని అరికట్టేందుకు అవసరమైన పురుగుమందుల వాడకం, శాసీ్త్రయ పద్ధతులు, నివారణా చర్యలపై గిరిజన రైతులకు అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
అధికారులు స్పందించాలి
ఐటీడీఏ కాఫీ విభాగం, ఉద్యానవనశాఖ అధికారులు ఈ పురుగు నివారణపై దృష్టి సారించాలి. రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. ఇప్పటికే ఇటువంటి చర్యలు చేపట్టి ఉంటే పురుగును ఆదిలోనే అరికట్టే అవకాశం ఉండేది. పదేళ్లుగా ఎంతో కష్టపడి పెంచిన తోటలు పురుగు వల్ల ఎండిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నాం.
– పోయిబ కృష్ణారావు, రైతు,
గొందికోడాపుట్టు, పెదబయలు మండలం
కాండం తొలుచు పురుగు సోకిన
కాఫీ చెట్టు
వాడిపోతున్న కాఫీ మొక్క
కాఫీ మొక్క మొదలు భాగంలో కాండం తొలిచిన ప్రాంతం


