● చర్యలు తీసుకోకుంటే
ఉద్యమం తీవ్రతరం
● ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు
వంతాల కృష్ణ హెచ్చరిక
పాడేరు రూరల్: చింతపల్లి మండలం లంబసింగి పంచాయతీ జలాగలగెడ్డ గ్రామానికి చెందిన పీటీజీ (ఆదిమ జాతి) గిరిజనులపై, మైదాన ప్రాంతాల నుంచి వలస వచ్చిన గిరిజనేతరులు దాడికి పాల్పడటంపై ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వంతాల కృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయం కోరుతూ పాడేరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట జలాగలగెడ్డ గిరిజనులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారం నాటికి 6వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షకు ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వంతాల కృష్ణ మాట్లాడుతూ గిరిజనేతరుల ఆగడాలను ఎండగట్టారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తే, ఆ పనులు జరగకుండా గిరిజనేతరులు అడ్డుకోవడం హాస్యాస్పదమని మండిపడ్డారు. రోడ్డు గురించి ప్రశ్నించినందుకు కొరుబయలులో నివాసం ఉంటున్న వలసదారులు ఆదివాసీలపై బరితెగించి దాడులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. గత వారం రోజులుగా జలాగలగెడ్డకు వెళ్లే దారిని పూర్తిగా మూసివేయడంతో కనీసం చిన్నపిల్లలు పాఠశాలలకు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా నేటికీ స్పందించకపోవడం దారుణమని కృష్ణ విమర్శించారు. 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలకు సర్వహక్కులు ఉన్నప్పటికీ, గిరిజనేతరుల అక్రమాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని విమర్శించారు.ఆదివాసీ గిరిజనులపై దాడి చేసిన వారిపై తక్షణమే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని.. లేకుంటే . ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, బాధితులు, గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


