నరకయాతన | - | Sakshi
Sakshi News home page

నరకయాతన

Mar 15 2026 1:17 AM | Updated on Mar 15 2026 1:17 AM

పవన్‌ కల్యాణ్‌ పర్యటనతో సామాన్యుల

పాడేరు– విశాఖ రహదారిలో బారికేడ్లు

వాహన రాకపోకలు నిలిపివేత

అవస్థలు పడిన ప్రయాణికులు

సాక్షి, పాడేరు: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పాడేరు పర్యటన సామాన్య ప్రయాణికులకు, వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు మిగిల్చింది. శనివారం ఉదయం 10 గంటల నుంచే పాడేరు – విశాఖపట్నం ప్రధాన రహదారిపై పోలీసులు ఎక్కడికక్కడే బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో జనం నరకయాతన పడ్డారు.

స్తంభించిన ప్రధాన రహదారి.. తప్పని నిరీక్షణ

పాడేరు నుంచి మైదాన ప్రాంతాలకు వెళ్లే అత్యంత కీలకమైన ఈ రహదారిపై ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు వాహనాలను పోలీసులు గంటల తరబడి నిలిపివేశారు. పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌ ఓనూరు జంక్షన్‌ దాటే వరకు ఇరువైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

ఎండలో అల్లాడి..

భానుడి భగభగలకు తోడు ట్రాఫిక్‌ నిలిచిపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు వాహనాల్లోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.డిప్యూటీ సీఎం నందిగరువు పర్యటన ముగిసిన తర్వాత కూడా ప్రయాణికుల అవస్థలు కొనసాగాయి. ప్రజా ప్రతినిధుల పర్యటనల కోసం సామాన్యుల ప్రాణాలు, సమయంతో చెలగాటం ఆడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

తారురోడ్డు పనుల పరిశీలన

ఓనూరు నుంచి నందిగరువు వరకు అడవితల్లిబాట పేరుతో కేంద్ర ప్రభుత్వ పీఎం జన్‌మన్‌ నిధులతో చేపట్టిన తారురోడ్డు పనులను డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ పరిశీలించారు. రూ.1.70 కోట్లతో ఈరోడ్డు నిర్మాణం పూర్తిచేశామని, రానున్న రోజులలో డోలిమోత లేని గ్రామాలు లక్ష్యమని ఆయన తెలిపారు. నందిగరువులో తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఇదే గ్రామంలో పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. పాఠశాల చిన్నారులకు స్కూల్‌ బ్యాగ్‌లు, అంగన్‌వాడీ చిన్నారులకు పౌష్టికాహార కిట్లు అందజేశారు. అంతకముందు నందిగరువు రోడ్డులో గిరిజనుల సమక్షంలో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఘాట్‌లో మోదకొండమ్మతల్లికి పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక ఆకాడమి చైర్మన్‌ వంపూరి గంగులయ్య, పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ శివ శ్రీనివాసరావు, కలెక్టర్‌ దినేష్‌కుమార్‌, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ, ఎస్పీ అమిత్‌బర్దర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement