భావోద్వేగాల నడుమ ‘విజయీభవ’ | - | Sakshi
Sakshi News home page

భావోద్వేగాల నడుమ ‘విజయీభవ’

Mar 15 2026 1:17 AM | Updated on Mar 15 2026 1:17 AM

సీలేరు: విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన పదవ తరగతి పరీక్షల ముంగిట, విద్యార్థినుల్లోని భయాందోళనలను తొలగించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు సీలేరు బాలికల ఆశ్రమ పాఠశాల ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది. శనివారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమం అటు తల్లిదండ్రులను, ఇటు విద్యార్థినులను భావోద్వేగానికి గురిచేసింది.

తల్లిదండ్రుల సమక్షంలో ఆత్మవిశ్వాసం

పరీక్షలంటే ఉండే ఒత్తిడిని దూరం చేసేందుకు ఇన్‌చార్జి హెచ్‌ఎం నాగ శకుంతల నేతృత్వంలో ఉపాధ్యాయ బృందం ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులందరినీ పాఠశాలకు ఆహ్వానించి, వారిని తమ పిల్లలతో ముఖాముఖిగా కూర్చోబెట్టారు.

మూడు గంటల సుదీర్ఘ సంభాషణ

సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ ఆత్మీయ భేటీలో పిల్లలు తమ మనసులోని మాటలను తల్లిదండ్రులతో పంచుకున్నారు. నాన్న.. నేను బాగా రాస్తా!.. నేను పరీక్షలు బాగా రాస్తాను నాన్న.. మీ నమ్మకాన్ని నిలబెడతాను.. అంటూ విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు మాట ఇస్తూ, వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం అక్కడ ఉన్న వారందరినీ కదిలించింది.

ఒత్తిడి లేని వాతావరణమే లక్ష్యం

సాధారణంగా పరీక్షల సమయంలో హాస్టల్‌ విద్యార్థులు ఇంటికి దూరంగా ఉంటూ కొంత ఆందోళనకు గురవుతుంటారు. ఈ విషయాన్ని గమనించిన పాఠశాల యంత్రాంగం, తల్లిదండ్రులను నేరుగా పాఠశాలకే పిలిపించి వారితో సమయం గడిపేలా చేయడం వల్ల విద్యార్థినుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. విద్యార్థుల భవిష్యత్తు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి, వారిని మానసికంగా సిద్ధం చేసిన ఇన్‌చార్జి హెచ్‌ఎం నాగ శకుంతల, తోటి ఉపాధ్యాయులను తల్లిదండ్రులు అభినందించారు.

సీలేరు ఆశ్రమ పాఠశాలలోవినూత్న ప్రయోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement