చోడవరం: వేసవి ప్రారంభంలోనే రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. ఉదయం నుంచి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నమయ్యే సరికి ఎండల తీవ్రత మరింతగా ఉంది. మధ్యాహ్న సమయంలో ప్రస్తుత ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉందంటే, రానున్న రోజుల్లో ఎండలు ఏ మేరకు ఉంటాయో చెప్పనక్కర లేదు. ఈ పరిస్థితుల్లో సగటు మనిషి ఆరోగ్యం క్షీణించి, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది. ఈ స్పీడ్ యుగంలో వాతావరణంలో వచ్చే మార్పులను గమనించకుండా మనిషి ఉండటంతో అనేకమంది అనారోగ్యం, మృత్యువాత కూడా పడుతున్నారు. వేసవిలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ప్రధానంగా సున్నితంగా ఉండే మనిషి తన ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు మనిషి శరీరంలో అవయవాలు అలసటకు గురై క్షీణించిపోయే ప్రమాదముంది. మనిషి శరీరంలో ఉండే ఉష్ణోగ్రతకు వాతావరణంలో పెరిగిన ఉష్ణోగ్రత తోడవ్వటం వల్ల శరీర లోపలి భాగాలు పని చేసేటప్పుడు కొంత ఒత్తిడికి గురవుతాయి. అందుకే ఎండలో తిరిగే సమయాల్లో సొమ్మసిల్లిపడిపోవడం, వడదెబ్బకు గురికావడం జరుగుతుంది. మండే ఎండలకు రాళ్లు సైతం బద్దలైపోతాయంటారు. అలాంటిది మనిషి ఆరోగ్యం ఎంత. అందుకే వేసవి వడదెబ్బ నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వేసవి ఎండల తీవ్రత నుంచి రక్షించుకోవడానికి ముందస్తు జాగ్రత్తలు ఇలా తీసుకుంటే మంచిది.
వేసవి ఎండల వల్ల ఉత్పన్నమయ్యే ఆరోగ్య సమస్యలు:
●ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల ఒంటిలో నీరు చెమట రూపంలో బయటికి పోతుంది. దీనివల్ల శరీరంలో లవణాలు తగ్గి అలసట, నీరసం వస్తుంది.
●మండుతున్న ఎండలో బయటకు తిరగడం వల్ల ఉష్ణం ఎక్కువగా శరీరంపై పడి కండరాలు, నరాలు, ఒత్తిడికి గురై బాడీ పెయిన్స్ వస్తాయి.
●తరచూ ఎండలో ఉండటం వల్ల మెదడు, కాలేయం, ఊపిరితిత్తులపై ఉష్ణోగ్రత ఎక్కువగా పడి అవి స్తబ్ధతకు గురవుతాయి. దీనివల్ల మనిషి వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది.
●ఉష్ణోగ్రత ఎక్కువగా తగిలినప్పుడు తలనొప్పి, ఫిట్స్ వంటి వ్యాధులు వస్తాయి.
●చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.
●వేసవిలో పరిసరాలు, తినే ఆహారం, తాగేనీరు పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే డయేరియా సోకే ప్రమాదం ఉంది.
ఎలాంటి ఆహారం, ద్రవపదార్థాలు తీసుకోవాలి :
●సాధారణ రోజుల్లో మనిషి 2–3 లీటర్ల నీరు తాగితే సరిపోతుంది. వేసవిలో 4 నుంచి 5 లీటర్ల నీరు రోజుకు తాగాలి.
●క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలి. బావుల్లోను, గుంటల్లోను, చెరువుల్లో నీరు కలుషితమై ఉంటుంది కాబట్టి తాగకూడదు.
●గ్లాసుడు చల్లని నీటిలో చిటికెడు ఉప్పు, పంచదార, నిమ్మరసం కలుపుకొని తాగాలి.
●మజ్జిగలో నిమ్మరసం, ఉప్పు తగిన మోతాదులో కలుపుకొని తాగాలి.
●క్యాంప్‌లకు వెళ్లేటప్పుడు ఇంటి దగ్గర క్లోరినేషన్ చేసిన నీటిని తీసుకెళ్తే మంచిది.
●గెంజి, పసరకడుగులో నిమ్మరసం, ఉప్పు కలుపుకొని తాగితే ఉష్ణాన్ని చల్లార్చుతాయి.
●శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది.
ఆహారం పదార్థాల్లో జాగ్రత్తలు :
●కూరగాయలు, మసాలా లేని వంటకాలు మాత్రమే తీసుకోవాలి.
●మాంసం, దుంపలు, మసాలాతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు.
వేసవిలో తీసుకోవలసిన పండ్లు :
●పుచ్చకాయ, కర్బూజా, కమల, దానిమ్మ, ద్రాక్ష పండ్లు తీసుకోవాలి. వీటి జ్యూస్ కనీసం రోజుకొకసారైనా తాగితే మంచిది. కొబ్బరి బొండాలు తాగాలి.
కూలీలు పనిచేసే సమయాలు :
వేసవి ముదురుతుండటంతో వడదెబ్బకు గురికాకుండా, వేసవి తాపం తగలకుండా కూలీలు పనివేళల్లో వేసవికాలంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. విధిగా చేయాల్సిన ఎనిమిది గంటల పనిదినాలను ఉదయం, సాయంత్రం సగం సగంగా చేసుకోవాలి. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల సమయాల్లో పనిచేసుకోవడం వల్ల ఎండదెబ్బ తగలకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి బయట తిరక్కుండా ఉంటే మంచిది.
వడగాడ్పుల నుంచి రక్షణ ఇలా :
●వడగాడ్పుల నుంచి రక్షణ కల్పించుకునేందుకు తగు జాగ్రత్తలు పాటించాలి.
●ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లేటప్పుడు, ద్విచక్ర వాహనాలపై వెళ్లేటప్పుడు విధిగా తలను కప్పుతూ చెవులకు కాటన్ క్లాత్‌ను కట్టుకోవాలి. హెల్మెట్ వాడితే మంచిది.
●వేసవికాలమంతా కాటన్ వస్త్రాలు, తేలికపాటి వస్త్రాలు ధరిస్తే ఎండకు శరీరం నుంచి వచ్చే చెమటను అవి పీల్చుకుని ఉపశమనమిస్తాయి. అంతేకాకుండా శరీరంపై ఎటువంటి వేడి బొబ్బులు రాకుండా చర్మానికి రక్షణ కల్పిస్తాయి.
కొద్దిపాటి నీరసం వస్తే డాక్టర్‌ను సంప్రదించాలి
వేసవిలో ఏమాత్రం ఆరోగ్యానికి ఇబ్బంది కలిగినట్లనిపించిన వెంటనే సమీపంలో వైద్యులను సంప్రదించాలి. కాటన్ దుస్తులూ ధరిస్తూ ఎండలో ఎక్కువగా తిరక్కుండా ఉంటే మంచిది. వడదెబ్బ తగిలిన వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలి. ఆలస్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదం కలుగుతుంది. పని చేసేటప్పుడు నీరసంగా ఉన్నట్లయితే వెంటనే చల్లటి ప్రదేశంలో సేద తీర్చుకుని నీళ్లు తాగితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
– డాక్టర్ బండారు సత్యనారాయణ, వైద్యుడు, చోడవరం
చలువ కోసం అమ్మకానికి ఉంచిన పుచ్చకాయల ముక్కలు
రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
ఆరోగ్య రక్షణపై అశ్రద్ధ వద్దు
వడదెబ్బకు తగలకుండా చూసుకోవాలి
శీతలపానీయాలు తాగడం మేలు
వైద్యాధికారుల సూచనలు


