నాటు తుపాకీ పేలిన ఘటనలో ఇద్దరు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నాటు తుపాకీ పేలిన ఘటనలో ఇద్దరు అరెస్ట్‌

Mar 11 2026 7:44 AM | Updated on Mar 11 2026 7:44 AM

● రెండు నాటు తుపాకులు, పేలుడు సామగ్రి స్వాధీనం ● విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ మోహనరావు

యలమంచిలి రూరల్‌ : సంచలనం కలిగించిన నాటు తుపాకీ పేలుడు ఘటనపై ఎట్టకేలకు మూడు రోజుల తర్వాత పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేయడంతో పాటు రెండు నాటు తుపాకులు, పేలుడుకు వినియోగించే గన్‌ పౌడర్‌, ఇతర సామగ్రిని స్వాధీనపర్చుకున్నారు. ఈ నెల 8వ తేదీన యలమంచిలి మండలం ఏటికొప్పాక శివారులో నాటు తుపాకీ పేలడంతో గ్రామానికి చెందిన 6వ తరగతి బాలుడు ఆడారి వెంకట కౌశిక్‌(12) దుర్మరణం పాలు కాగా మరొక విద్యార్థి గాయపడిన సంగతి తెల్సిందే. ఈ కేసుకు సంబంధించి పరవాడ ఇంఛార్జ్‌ డీఎస్పీ బి.మోహనరావు మంగళవారం సాయంత్రం యలమంచిలి సర్కిల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 8వ తేదీ ఆదివారం ఏటికొప్పాక గ్రామానికి చెందిన 8 మంది విద్యార్థులు ఆడుకోవడానికి గ్రామ శివారులో వరహా నది సమీపంలో ఆనకట్ట వద్దకు వెళ్లారు. కొంతసేపు ఈత కొట్టిన తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మా ఇంట్లో ఉన్న తుపాకులు చూపిస్తానంటూ వారిలో ఓ విద్యార్థి మిగిలిన విద్యార్థులను పక్కనే కొండ దిగువన కశింకోట సూరిబాబు తాటాకు ఇంటికి తీసుకెళ్లాడు. రెండు నాటు తుపాకులను విద్యార్థులకు చూపిస్తుండగా ఒక తుపాకీలో అప్పటికే పేలుడు పదార్థాలు కూరి ఉంచడంతో అది ప్రమాదవశాత్తూ పేలి తూటాలు ఎదురుగా ఉన్న ఆడారి వెంకట కౌశిక్‌ (12) శరీరంలోకి దూసుకెళ్లాయి. కౌశిక్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు బాలురు కూడా స్వల్పంగా గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో కశింకోట సూరిబాబు ఇంట్లో లేడు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఇంటికి చేరుకున్న సూరిబాబు నాటు తుపాకులు కలిగి ఉన్నట్టు తెలిస్తే కేసు పెడతారన్న భయంతో తన ఇంటి ముందున్న ఆడారి వెంకట కౌశిక్‌ మృతదేహాన్ని సమీపంలో పోలవరం కాల్వ ఒడ్డుకు తరలించాడు. రక్తపు మరకలు తుడిచి కుమారుడిని తీసుకుని ఇంటి నుంచి పరారయ్యాడు.

రెండు నాటు తుపాకులు స్వాధీనం

కేసులో ప్రధాన నిందితుడు కశింకోట సూరిబాబు వద్ద లైసెన్సు లేకుండా రెండు నాటు తుపాకులు కలిగి ఉన్నందుకు బీఎన్‌ఎస్‌ 106(1), 238, ఆర్‌మ్స్‌ యాక్టు 1959 సెక్షన్‌ 25,27, ఎక్స్‌ప్లోసివ్స్‌ యాక్ట్‌ 1884 సెక్షన్‌9(బి) ప్రకారం యలమంచిలి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రైం నెంబరు 46/2026 నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు సూరిబాబు దాచిపెట్టిన రెండు నాటు తుపాకులు, తూటాలు పేల్చడానికి ఉపయోగిస్తున్న గన్‌పౌడర్‌, ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనపర్చుకున్నారు పోలీసులు. గన్‌పౌడర్‌ విక్రయిస్తున్న కశింకోటకు చెందిన ముత్యాల అప్పల రమణలను అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు కశింకోట సూరిబాబును రిమాండ్‌కు పంపించామని డీఎస్పీ తెలిపారు. స్వాధీనపర్చుకున్న రెండు నాటు తుపాకుల్లో ఒకటి పాతది కాగా రెండోది కొత్తదిగా దర్యాప్తులో తేలింది. ఎవరైనా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే చట్టప్రకారం నేరమని, వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ స్పష్టం చేశారు. ఇకపై సబ్‌డివిజన్‌ పరిధిలో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడతామన్నారు. ఎవరైనా అక్రమంగా అయుధాలు కలిగి ఉంటే పోలీసులకు స్వాధీనపర్చాలన్నారు.

నిందితుడి వద్ద నుంచి పోలీసులు స్వాధీనపర్చుకున్న నాటు తుపాకులు, పేలుడు సామగ్రి

వివరాలు వెల్లడిస్తున్న పరవాడ ఇంఛార్జ్‌ డీఎస్పీ బి మోహనరావు.చిత్రంలో వెనుక అరెస్టయిన ప్రధాన నిందితుడు కశింకోట సూరిబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement