మాడుగుల: ఉత్తరాంధ్ర ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ తీర్థాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ విద్యుత్ లైటింగ్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. అమ్మవారిని పూలు, నగలుతో ప్రత్యేకంగా అలంకరించారు. తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు తీన్‌మార్, డీజే సౌండ్‌ల మధ్య అమ్మవారి తీర్థంగా వైభవంగా జరిగింది.
ఆకట్టుకున్న ఎడ్ల పరుగు పందెంలు
తీర్థం సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఎడ్ల పరుగు పందేలు ఆద్యంతం హుషారుగా సాగాయి. ఈ పోటీలను ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకటరాజారామ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీలను తిలకించడానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు.


