క్రమశిక్షణకు నిలయాలు... గురుకులాలు
మెరుగైన సదుపాయాలతో
నాణ్యమైన విద్య
క్రీడలు, పోటీ పరీక్షలకు తర్ఫీదు
సీట్లకు పెరిగిన డిమాండ్
ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక
నర్సీపట్నం : పేద విద్యార్థులకు మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాలు(ఎంజేపీ) ఆశాకిరణాలుగా నిలుస్తున్నాయి. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యా బోధన అందిస్తున్నాయి. వీటిలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడుతున్నారు. ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణకు మారుపేరు గురుకులం. ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనతో పాటు క్రీడలు, పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇస్తుంటారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులతో విద్యా బోధన జరుగుతుంది. అనేక సదుపాయాలు గురుకుల విద్యార్థులకు కల్పిస్తున్నారు. ఈ ఏడాది గురుకులంలో సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో బాల, బాలికల గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు ప్రభుత్వం అవకాశాలు కల్పించింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి సీట్ల భర్తీకి గురుకుల విద్యాలయ సంస్థ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రవేశ పరీక్షల్లో రాణించిన వారికి ప్రాధాన్యమిస్తారు. జిల్లాలో తానాం, పాయకరావుపేట, చోడవరం, అన్నవరం(బాలికలు), నర్సీపట్నం, అనకాపల్లి, సింహాచలం, పెదనరం (బాలుర గురుకులాలు ఉన్నాయి. వీటిలో ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్ విధానంలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయింపు జరుగుతుంది.
ఇవీ అర్హతలు..
అర్హులైన విద్యార్థులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఐదో తరగతి ప్రవేశానికి 9 నుంచి 11 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్లు లోపు ఉండాలి. ప్రభుత్వం లేదా, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో తప్పనిసరిగా 3,4 తరగతులు చదివి ఉండాలి. తానాం 80 సీట్లు, ఎస్.రాయవరం 40, చోడవరం 40, నర్సీపట్నం 40, అనకాపల్లి 40, సింహాచలం 160, పెదనరం 60, అన్నవరం 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తానాం, సింహాచలంలో ఇంటర్మీడియేట్ అందుబాటులో ఉంది. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి.
సీట్లకు డిమాండ్ పెరిగింది..
ఎంజేపీ గురుకులంలో సీట్ల డిమాండ్ పెరిగింది. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తాం. నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఉంటుంది. వారి అభ్యున్నతికి ఇక్కడే బాటలు వేస్తాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుండడంతో సీట్లకు డిమాండ్ పెరిగింది. 6,7,8 తరగతుల్లో మిగిలిన సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నాం. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– డా..ఎం.విజయ్‌దేవరాజు, ప్రిన్సిపాల్
ఎంజేపీ గురుకులం, నర్సీపట్నం
క్రమశిక్షణకు నిలయాలు... గురుకులాలు


