గంజాయి తరలిస్తున్న ఏడుగురు అరెస్టు
నర్సీపట్నం : గొలుగొండ మండలం, కృష్ణదేవిపేట సమీపంలో కారులో గంజాయి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, కృష్ణదేవిపేట ఎస్‌ఐ రుషికేశ్వరరావు సిబ్బందితో కలిసి గురువారం పల్లావూరు చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. కారులో 50 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయి తరలింపులో రాజవొమ్మంగికి చెందిన గంటిమల్ల రాజుకుమార్ ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. అతనిపై 14 కేసులు ఉన్నాయన్నారు. చిత్రకొండ వద్ద ఈ గంజాయి కొనుగోలు చేసి రాజమండ్రి తీసుకువెళ్తుండగా పల్లావూరు వద్ద పట్టుకోవడం జరిగిందన్నారు. ప్రధాన నిందితుడితో పాటు అభినేష్ మునియప్పన్, మెరిపో కిశోర్, గంటిమల్ల లోవరాజు, మెరిపో లావణ్య, చెన్నాడ ప్రవీణ్‌కుమార్, మెరిపో విజయ్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారు, 3 స్కూటీలు, ఏడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ, ఎస్‌ఐలను డీఎస్పీ అభినందించారు.


