
ఎన్నిసార్లు ధ్రువపత్రాలివ్వాలి
చింతూరు: ఆర్‌అండ్‌ఆర్ పరిహార నిమిత్తం అధికారులు పదేపదే ధ్రువపత్రాలు ఇవ్వాలని కోరడంపై పోలవరం నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అన్ని ధ్రవపత్రాలు సమర్పించిన చింతూరుకు చెందిన పోలవరం నిర్వాసితులు డ్రాఫ్ట్ ఆర్‌అండ్‌ఆర్ గ్రామసభ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 863 మంది సమర్పించిన ధ్రువపత్రాలు పూర్తిస్థాయిలో లేవని వీరంతా తిరిగి ధ్రువపత్రాలు సమర్పించాలంటూ ఆదివారం పోలవరం అధికారులు చింతూరులో సమావేశం నిర్వహించారు. దీనిపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికే రూ.వేలు ఖర్చుచేసి అప్‌లోడ్ నిమిత్తం అనేకమార్లు ధ్రువపత్రాలు ఇచ్చామన్నారు. మళ్లీ ధ్రువపత్రాలు కావాలని అడగటమేంటని వారు అధికారులను ప్రశ్నించారు. మరోవైపు ఆర్‌అండ్‌ఆర్ పెండింగ్ ధ్రువపత్రాల జాబితాతో పాటు చిన్న దుకాణాలకు రూ. 25 వేల పరిహారం, పశువుల కొట్టాలకు పరిహారం అందించేందుకు కూడా అధికారులు జాబితాను విడుదల చేశారు. అయితే దుకాణాలు, పశువుల కొట్టాలకు సంబంధించిన జాబితాల్లో చాలామంది పేర్లు నమోదు కాలేదని, అనర్హుల పేర్లను జాబితాలో చేర్చారంటూ నిర్వాసితులు మండిపడుతున్నారు. దుకాణాల పరిహారానికి సంబంధించిన జాబితాలో తొమ్మిది ఏళ్లకు చెందిన పిల్లలకు కూడా దుకాణాలు ఉన్నట్లు జాబితాలో ఉండటంతో ఇదెక్కడి విడ్డూరమంటూ వారు విస్మయం వ్యక్తం చేశారు. దుకాణాలు, పశువుల కొట్టాల జాబితాపై అధికారులకు సమగ్ర విచారణ జరిపి అనర్హులను తొలగించి అర్హులకు న్యాయం చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు.
సరిగ్గా లేనందునే మళ్లీ సేకరణ.. : చింతూరు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో శుభం నొఖ్వాల్
నిర్వాసితులు సమర్పించిన కొన్ని ధ్రువపత్రాలు సరిగ్గా లేనందునే తిరిగి ధ్రువపత్రాలు తీసుకుంటున్నట్లు చింతూరు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో శుభం నొఖ్వాల్ తెలిపారు. ఆదివారం నిర్వాసితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డ్రాఫ్ట్ ఆర్‌అండ్‌ఆర్ నిమిత్తం పోలవరం అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయానికి పంపిన జాబితాకు సంబంధించి కొంతమంది ధ్రువపత్రాలు సరిగా లేకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చాయని ప్రస్తుతం వారి ధ్రువపత్రాలు మాత్రమే తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి ఆర్‌అండ్‌ఆర్, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బందితో టీంలను ఏర్పాటు చేశామన్నారు. వీరంతా ఇంటింటికీ వెళ్లి కావాల్సిన ధ్రువపత్రాలు తీసుకుంటారని పీవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్డీడీసీలు అంబేద్కర్, బాలకృష్ణారెడ్డి, తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీవో శ్రీనివాస్‌దొర పాల్గొన్నారు.
అధికారులపై పోలవరం నిర్వాసితుల ఆగ్రహం

ఎన్నిసార్లు ధ్రువపత్రాలివ్వాలి