
సైరన్.. సైలెంట్!
● వరద నీరు వదిలే సమయంలో
ప్రమాదాలకు ఆస్కారం
● నామమాత్రంగా రక్షణ ఏర్పాట్లు
● విహారం మాటున పర్యాటకులకు ముప్పు
ముంచంగిపుట్టు : వరద నీరు వచ్చే జలపాతాల వద్ద నిషేదాజ్ఞలు లేకపోవడం, రక్షణ ఏర్పాట్లు నామమాత్రంగా ఉండడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అయినప్పటికీ ప్రాజెక్ట్ అధికారులకు పట్టడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
శబ్దం వినిపించక..
జోలాపుట్టు ప్రాజెక్ట్ నుంచి శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు డుడుమ జలాశయానికి రెండు వేల క్యూసెక్కులు విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నిండిపోవడంతో సాయంత్రం 4 గంటలకు డుడుమ జలాశయం 7వ నంబరు గేటును ఎత్తి బలిమెల జలాశయానికి వరద విడుదల చేశారు. అదే సమయంలో ప్రాజెక్ట్ దిగువన డుడుమ జలపాతం ఎగువకు మధ్యలోని బండరాళ్లపై నిలబడి డ్రోన్ కెమెరాతో ప్రకృతి అందాలు చిత్రీకరిస్తున్న ఒడిశాకు చెందిన యూట్యూబర్ సాగర్‌కుండు ప్రవాహంలో చిక్కుకుని కొట్టుకుపోయాడు. నీటి విడుదల సమయంలో డుడుమ ప్రాజెక్ట్ వద్ద సైరన్ ఆన్ చేసినప్పటికీ పెద్దగా శబ్దం రానందున నీటి విడుదల సంకేతం తెలియక యూట్యూబర్ ప్రమాదానికి గురై ప్రవాహంలో గల్లంతయ్యాడు. నీటి విడుదల హెచ్చరికలు తెలియజేసేందుకు ఏర్పాటుచేసిన ఈ సైరన్ కనీసం నాలుగు కిలోమీటర్లు దూరం కూడా వినిపించకపోవడం గమనార్హం.
● ఆంధ్రా–ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న జోలాపుట్టు జలాశయం నీటిని డుడుమ జలాశయంలోకి విడుదల చేసి తద్వారా మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి తరలిస్తారు. వరద నీరు భారీగా చేరితే డుడుమ నుంచి బలిమెల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తారు. ఈ సమయంలో సమీప ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు రెండు ప్రాజెక్ట్‌ల వద్ద సైరన్లు ఉన్నాయి. వీటిలో జోలాపుట్టు వద్ద ఏర్పాటుచేసిన సైరన్ సుమారు రెండు కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది. డుడుమ జలాశయం వద్ద సైరన్ సిబ్బందికి తప్ప దిగువ ఉన్న డుడుమ జలపాతం వద్ద పర్యాటకులు, రంగబయలు, వనుగుమ్మ పంచాయతీల్లో తొమ్మిది గ్రామాల గిరిజనులకు వినిపించడం లేదు. శనివారం డుడుమ ప్రవాహంలో యూట్యూబర్ కొట్టుకుపోవడమే ఇందుకు ఉదాహరణ.
● డుడుమ జలాశయం దిగువన ఉన్న డుడుమ జలపాతం సుమారు 556 అడుగుల ఎత్తునుంచి జాలువారుతుంది. వరద నీరు విడుదల అయినప్పుడల్లా పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుంది. ఈ ప్రాంతం భూతల స్వర్గాన్ని తలపించేలా ఉన్నందున నిత్యం పర్యాటకుల తాకిడి ఉంటుంది. ప్రకృతి అందాలను తిలకించేందుకు ఎగువున ఉన్న బండరాళ్ల వద్ద ఎక్కువ మంది గడుపుతుంటారు. ఇక్కడి నుంచే డ్రోన్ కెమె
రాల ద్వారా ప్రాజెక్ట్, జలపాతం అందాలను చిత్రీకరిస్తుంటారు. ఇక్కడి ప్రవాహంలో మత్స్యకారులు చేపలను వేటాడుతుంటారు. వరదనీరు విడుదల సమయంలో సైరన్ శబ్దం నామమాత్రంగా ఉండటంతో ప్రమాదకర పరిస్థితులు పొంచి ఉన్నాయి.
డుడుమ జలాశయం వద్ద మొక్కుబడిగా హెచ్చరికలు
ప్రమాదాల్లో కొన్ని..
ప్రమాదాల నివారణకు చర్యలు
డుడుమ జలపాతం వద్ద ప్రమాదాలు జరగకుండా ఒడిశా అధికారులతో మాట్లాడాం. ఒడిశా అధికారులు డుడుమ జలపాతం వద్ద సెక్యూరిటీ గార్డును నియమించారు. ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. జలపాతం వద్ద గల్లంతై ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
– శ్రీనివాసరావు, సీఐ, జి.మాడుగుల
2013, సెప్టెంబర్ 17: డుడుమ జలపాతం వద్ద విహారానికి వచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరుకు చెందిన గుణ్ణం లావణ్య(26) ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో జలపాతంలో కొట్టుకుపోయింది. బండరాళ్ల మధ్యం సొరంగంలో కొట్టుకుపోయింది. దాదాపు 20 రోజుల తరువాత మృతదేహం బయటపడింది.
2024, అక్టోబర్ 25: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా ఒనకఢిల్లీ పంచాయతీ కుబిగూడకు చెందిన శుక్ర గోల్లొరి (53) అనే గిరిజన మత్స్యకారుడు చేపల వేట చేస్తుండగా ప్రవాహం పెరగడంతో వాగులో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు.
2025, జూన్ 14: కోల్‌కతాకు చెందిన అనిమోష్‌దాస్ అనే పర్యాటకుడు అన్యయ్య, వదినతో కలిసి డుడుమ జలపాతం సందర్శనకు వచ్చాడు. జలపాతంలోకి దిగి ఆస్వాదిస్తుండగా ప్రవాహం పెరగడంతో మునిగి గల్లంతయ్యాడు. వారం రోజులపాటు గాలింపు చేపట్టాయి. అయితే ఇప్పటికీ అతని ఆచూకీ లభ్యం కాలేదు.