
వరద బాధితులను గాలికొదిలేసిన కూటమి
● వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే న్యాయం
● మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ధ్వజం
వీఆర్‌పురం: కూటమి ప్రభుత్వం వరద బాధితులను గాలికి వదిలేసిందని మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి విమర్శించారు. తమ ప్రభుత్వంలోనే పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగిందన్నారు. ఆదివారం ఆమె వీఆర్‌పురం, గొల్లగూడెం, ఒడ్డుగూడెం, ఒడ్డుగూడెం కాలనీ రాజుపేట, శ్రీరామగిరి, చింతరేవుపల్లిలో పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడారు. బాధితులకు రెండు బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పప్పు, నూనె ఇచ్చేందుకు అనేక అంక్షలు పెట్టిందన్నారు. నిత్యావసర సరకులు ఇచ్చేందుకు వారం రోజులు పట్టిందన్నారు. గత ప్రభుత్వంలో తాము రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి వలంటీర్లతో ఇంటింటికీ తక్షణ ఆర్థిక సాయం, నిత్యావసర సరకులు పంపిణీ చేశామన్నారు. తమ ప్రభుత్వంలో 2022లో సంభవించిన వరదలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. గోదావరి వరదలు 72 అడుగులకు చేరిన సందర్భంలో పడవలపై తిరిగి వరద బాధితులకు నిత్యావసర సరకులు అందజేశామని గుర్తు చేశారు. తక్షణ సాయంగా రూ.2వేలు, పూర్తి డ్యామేజీకి రూ.90 వేలు, ముంపునకు గురైన ప్రతి కుటుంబం నివాసరం నిర్మించుకునేందుకు రూ.10 వేల సాయం అందజేశామన్నారు. బియ్యం, నిత్యావసరాలు రెండు సార్లు పంపిణీ చేశామని వివరించారు. కాంటూరు లెక్కలతో సంబంధం లేకుండా 2022 వరదల ప్రాతిపదికన ముంపునకు గురైన 32 గ్రామాలను ప్రాధాన్యత జాబితాలో చేర్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. వరద బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. పార్టీ మండల కన్వీనర్ మాదిరెడ్డి సత్తిబాబు, వైస్ ఎంపీపీ ముత్యాల భావని, సర్పంచ్ సోడె నరసమ్మ, ఎంపీటీసీ బంధం విజయలక్ష్మి, రాజుపేట, చింతరేవుపల్లి సర్పంచ్‌లు వడ్డాణపు శారద, పిట్టా రామారావు, కూనవరం ఎంపీటీసీ కొమ్మని అనంతలక్ష్మి, పార్టీ మండల కన్వీనర్ రామలింగరెడ్డి, జెడ్పీటీసీ చిచ్చడి మురళి, వైస్ ఎంపీపీ చిన్ని పాల్గొన్నారు.
వరద బాధితులకు అండగా వైఎస్సార్‌సీపీ
కూనవరం: వరద బాధితులను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎంతగానో ఆదుకుందని, ఇప్పుడు కూడా మీ అందరికీ తమ పార్టీ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే, రంపచోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. మండల కేంద్రం టేకులబోరులో వరద ముంపునకు గురైన ఉదయభాస్కర్ కాలనీలో వరద బాధితులను ఆదివారం ఆమె పరామర్శించారు. తమ కష్టాలను, బాధలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే గాని, అధికారులగాని రాలేదని వరద బాదితులు వాపోయారు. అనంతరం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏటా వచ్చే గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 32 గ్రామాలను ప్రాధాన్యత జాబితాలో చేర్చించారని గుర్తుచేశారు. రానున్నది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమేనని ఎవరూ అధైర్యపడవద్దని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. బాబు సూపర్‌సిక్స్ అట్టర్ ప్లాప్ అని ఏడాదిలోపే రుజువైందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఆలూరి కోటేశ్వరరావు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆవుల మరియాదాస్, ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకులు గుజ్జా బాబు, ఎంపీపీ పాయం రంగమ్మ, జెడ్పీటీసీ గుజ్జా విజయ, చింతూరు మండల కన్వీనర్ రామలింగారెడ్డి, జెడ్పీటీసీ చిచ్చడి మురళి, స్థానిక ఎంపీటీసీ కొమ్మాని అనంతలక్ష్మి, చింతూరు వైస్ ఎంపీపీ చిన్ని పాల్గొన్నారు.

వరద బాధితులను గాలికొదిలేసిన కూటమి