
ధారకొండను మండలకేంద్రంగా ప్రకటించాలి
● ప్రభుత్వం ప్రకటించాలని ఆదివాసీల డిమాండ్
● వారపు సంతలో భారీగా ర్యాలీ
సీలేరు: ధారకొండను మండల కేంద్రంగా తక్షణమే ప్రభుత్వం ప్రకటించాలని ఆదివాసీలు డిమాండ్ చేశారు. ఆదివారం వీరు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మండలాల విభజనలో స్థానం కల్పించి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. దశాబ్దాల కాలంగా ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఈ ఆరు పంచాయతీలు నేటికీ అభివృద్ధికి దూరంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాంత యువత భవిష్యత్తు బాగుండాలంటే తక్షణమే ధారకొండను మండల కేంద్రంగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. విద్య, వైద్యం, రోడ్లు తాగునీరు వ్యవసాయ రంగాలను పూర్తిస్థాయిలో అభివృద్ధిపరిచేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సీలేరు, దుప్పులవాడ, ధారకొండ, గుమ్మురేవుల, అమ్మవారి ధారకొండ, ఏ.ధారకొండ గ్రామాల గిరిజనులు వారపు సంతలో నిర్వహించిన ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆర్‌వీ నగర్ నుంచి సీలేరు మీదుగా పాలగెడ్డ వరకు ఉన్న రహదారిని తక్షణమే అభివృద్ధి చేయాలని వారు డిమాండ్ చేశారు. మండల సాధన కమిటీ అధ్యక్షుడు కారే శ్రీనివాస్, సీనియర్ నాయకుడు సుంకర విష్ణుమూర్తి. మార్క్ రాజ్, జగన్, సర్పంచ్ రాజు, దుర్గ, కమలమ్మ, రామన్న తదితరులు పాల్గొన్నారు.