
గిరిజన ఉద్యమనేత ఏలియా ఇకలేరు
హుకుంపేట: గిరిజన ఉద్యమ నేత, దండకారణ్య విమోచన సమితి వ్యవస్థాపకుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు చెండా ఏలియా (68) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యం కారణంగా విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గిరిజన ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘ నేతలు ఆయన స్వగ్రామం తడిగిరి గ్రామానికి వెళ్లారు. భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. అరకు, పాడేరు ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ స్వగ్రామంలోని ఆయన భౌతిక కాయాన్ని సందర్శించారు. నివాళులర్పించిన అనంతరం వారు మాట్లాడుతూ గిరిజన ప్రాంత హక్కులు, చట్టాలకోసం పోరాడిన ఉద్యమ నేత మృతి చెందడం గిరిజనులకు తీరని లోటన్నారు. ఆయన మరణం జీర్ణించుకోలేనిదన్నారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి సంతాపం తెలిపారు. వైఎస్సార్‌సీపీ హుకుంపేట, పాడేరు మండల అధ్యక్షుడు పాంగి అనిల్, సీదరి రాంబాబు, పలువురు సర్పంచులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనుల కోసం చేపట్టిన ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు. హుకుంపేట నుంచి అశ్రునయనాల మధ్య ప్రారంభమైన అంతిమయాత్రలో గిరిజన ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంత్యక్రియలు ఆయన స్వగ్రామం తడిగిరిలో జరిగాయి.
కొద్దిరోజులుగా అనారోగ్యం
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
భౌతికకాయం వద్ద పలువురి నివాళి
అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర
తడిగిరిలో అంత్యక్రియలు

గిరిజన ఉద్యమనేత ఏలియా ఇకలేరు

గిరిజన ఉద్యమనేత ఏలియా ఇకలేరు