
మన్యంలో చోడి నాట్లు ఆలస్యమే
సాక్షి, పాడేరు: ఖరీఫ్‌లో గిరిజన రైతులు సాగు చేసే చోడి (రాగులు) పంటకు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పూర్తి కావాల్సిన చోడి నాట్లు ఆలస్యమవుతున్నాయి. అన్ని చోట్ల వర్షాలు కురవకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల చోడి నారు ఎదుగుదల ఆశాజనకంగా లేదు. ప్రతి ఏడాది ఆగస్టు 2వ వారానికే ఏజెన్సీవ్యాప్తంగా నూరుశాతం చోడిపంట నాట్లు పూర్తి చేయాల్సిన పరిస్థితి. అయితే ఈసారి మాత్రం ఇప్పటికి అతికష్టం మీద 40 శాతం నాట్లు పూర్తయ్యాయని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. ఏజెన్సీలో వరిపంట తరువాత అత్యధికంగా 17 వేల హెక్టార్ల మెట్ట, కొండపోడు భూముల్లో గిరిజన రైతులు చోడిపంటను సాగు చేస్తారు. ఇంటి అవసరాలతోపాటు వాణిజ్య అమ్మకాలకు చోడిపంటకు మన్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో కూడా సుమారు 3 వేల హెక్టార్లలో చోడిపంట సాగవుతుంది. అయితే ఈ ఏడాది సకాలంలో వర్షాలు విస్తారంగా కురవకపోవడంతో అన్ని పంటల వ్యవసాయం ఆలస్యమైంది.
చోడి నాట్లు ఆలస్యం
ఏజెన్సీవ్యాప్తంగా చోడి పంట నాట్లు ఆలస్యమవుతుండడంపై గిరిజన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చోడినారు అనేక ప్రాంతాలలో ఎండిపోతున్న పరిస్థితిలో గత నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో గిరిజన రైతులు మళ్లీ చోడినాట్లను ప్రారంభించారు. చోడినారు తీత, పంట భూములకు తరలింపు, వరినాట్ల పనులను చేపడుతున్నారు. అయితే ఇప్పటికే నాట్లు ఆలస్యమవ్వడంతో పంట ఎదుగుదలపై రైతుల్లో ఆందోళన నెలకొంది. నాట్లు వేసిన తరువాత వర్షాలు కురవని పక్షంలో చోడినాట్లు ఎండిపోయే ప్రమాదాన్ని రైతులు తలచుకుని ఆవేదన చెందుతున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ ఖరీఫ్‌లో వ్యవసాయానికి వర్షాభావ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. వ్యవసాయ పనులు మెల్లమెల్లగా జరుగుతుండడంతో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గిరిజన ప్రాంతాలలో వ్యవసాయమంతా వర్షాలపైన ఆధారపడి ఉంది. వర్షాలు మాత్రం అన్ని చోట్ల కురవకపోవడంతో మరింత ఇబ్బందిగా మారింది.
పంటల ఎదుగుదలపై ఆందోళన
వరితోపాటు చోడిపంట ఎదుగుదలపై ఆందోళన నెలకొంది. వ్యవసాయ సీజన్ ప్రారంభం నుంచి పూర్తిస్థాయిలో వర్షాలు కురవలేదు. చోడి పంట నాట్లు కూడా ఆలస్యమవుతున్నాయి. అన్ని చోట్ల వర్షాలు కూడా కురవకపోవడంతో మరింత ఇబ్బందిగా మారింది. దిగుబడులు కూడా తగ్గే పరిస్థితులు ఉన్నాయి.
–కొర్రా వెంకటరావు, గిరిజన రైతు, పోతంగి, డుంబ్రిగుడ మండలం
ఈ నెలాఖరుకు పూర్తి చేసే లక్ష్యం
ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో ఈనెలాఖరు నాటికి చోడి నాట్లు పూర్తి చేసే లక్ష్యంతో రైతులను సమయత్తపరుస్తున్నాం. వర్షాలు ఆలస్యమవ్వడంతో నాట్లు ఆలస్యమయ్యాయి. మోస్తరు వర్షాలు కురిసే సమయంలో రైతులు ఆలస్యం చేయకుండా చోడి నాట్లు వేసుకోవాలి.
–ఎస్.బి.ఎస్.నందు, జిల్లా వ్యవసాయాధికారి, పాడేరు

మన్యంలో చోడి నాట్లు ఆలస్యమే

మన్యంలో చోడి నాట్లు ఆలస్యమే