
వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆరాధ్య
పరవాడ: భర్నికం శివారులోని బాపడుపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఒకటో తరగతి విద్యార్థిని ఆరాధ్య బెహ్ర .. తన అసాధారణ జ్ఞాపకశక్తితో అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఈ మేరకు పాఠశాల ఉపాధ్యాయుడు కొరుపోలు గంగాధరరావు తెలిపారు. యాదృచ్ఛికంగా ఇచ్చిన ఆంగ్ల అక్షరమాలలోని అక్షరాలను కేవలం 1 నిమిషం 30 సెకన్లలో సరైన క్రమంలో పేర్చడం ద్వారా ఆరాధ్య ఈ రికార్డును సాధించిందని ఆయన వివరించారు. ఎటువంటి సహాయం లేకుండా, కేవలం తన జ్ఞాపకశక్తిని ఉపయోగించి ఈ ఘనతను సాధించిందన్నారు. పాఠశాలలో జూలై 30న జరిగిన కార్యక్రమంలో ఆరాధ్య ఈ ప్రతిభను ప్రదర్శించిందని.. ఆమె ప్రతిభను గుర్తించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆరాధ్య పేరును నమోదు చేసినట్లు తెలిపారు. పాఠశాలలో గురువారం నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ఎంఈవోలు ఎం.దివాకర్, జి. సాయిశైలజ విద్యార్థినితో పాటు ఉపాధ్యాయుడు గంగాధరరావును అభినందించారు. కార్యక్రమంలో సింహాద్రి ఎన్టీపీసీ సీఎస్సార్ విభాగం సీనియర్ మేనేజర్ కె. ప్రకాశరావు, శివం తదితరులు పాల్గొన్నారు.

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఆరాధ్య