
ఎర్రవరం జలపాతానికి రాకపోకలు బంద్
చింతపల్లి: మండలంలో గల ఎర్రవరం జలపాతానికి పర్యాటకులు రాకపోకలు సాగించకుండా రెవెన్యూ అధికారులు రహదారిని బంద్ చేశారు. గొందిపాకలు పంచాయతీ పరిధిలో గల ఈ జలపాతానికి వర్షాలు తగ్గేంతవరకూ పర్యాటకులు సందర్శనకు వెళ్లరాదని మండల తహసీల్దారు జి.ఆనందరావు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదకర జలపాతాలలో ప్రాణనష్టం సంభవించకుండా జిల్లా కలెక్టర్ దినేష్‌కుమార్ ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో ప్రమాదకర పర్యాటక ప్రాంతాలలో సందర్శకుల రాకపోకలు నిషేధించినట్లు తెలిపారు. గురువారం తమ సిబ్బందిని పంపించి ఎర్రవరం జలపాతానికి వెళ్లే రహదారికి అడ్డుగా కంచె ఏర్పాటు చేశారు.