
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, పాడేరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అక్రమాలు, దారుణాలు జరిగినా ఎన్నికల కమిషన్‌కు పట్టకపోవడం అన్యాయమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకాలు చేసిందన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ‘కూటమి’ నాలుగు పార్టీలతో జత కట్టినా పులివెందులలో గెలవలేకపోయిందన్నారు. 65 వేల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ విజేతగా నిలిచిన నియోజకవర్గంలోని జెడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ గెలుచుకుందంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగాయని, వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కంచుకోటలో పోలీసులను అడ్డం పెట్టుకుని గుండాలతో వైఎస్సార్‌సీపీ నాయకులు, ఏజెంట్లపై దాడి జరిపించడం దారుణమన్నారు. దౌర్జన్యంతో విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేయించి పులివెందులలో గెలవడం సిగ్గు చేటన్నారు. సంబరాలు చేసుకోవడానికి సీఎం చంద్రబాబుకు సిగ్గుండాలని మండిపడ్డారు. చేతనైతే ఈ ఉప ఎన్నికలను రద్దు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపాలని, అప్పుడు టీడీపీ గెలిస్తే పాడేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. టీడీపీ ఓడిపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తావా అంటూ చంద్రబాబుకు సవాల్ చేశారు. ఎన్నికల కమిషన్ కూటమి ప్రభుత్వాన్ని వెనకేసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన ఎన్నికల కమిషన్ ఇంతగా దిగజారడం అన్యాయమన్నారు.