
పంచాయతీలకు పన్ను నొప్పి
● ఏళ్ల తరబడి వసూలు కాని బకాయిలు ● కుంటుపడుతున్న అభివృద్ధి
రంపచోడవరం పంచాయతీ కార్యాలయం
రంపచోడవరం: జిల్లాలో పాడేరు డివిజన్‌లో 244, రంపచోడవరం డివిజన్‌లో 120, చింతూరు డివిజన్‌లో 66 గ్రామపంచాతీలుండగా, వీటిలో అత్యధిక పంచాయతీల్లో సకాలంలో పన్నులు వసూలు కాకపోవడంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయి. దీనికి తోడు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీల్లో ఎటువంటి అభివృద్ధి పనులు జరగడం లేదు.
రంపచోడవరం డివిజన్‌లో మేజర్ పంచాయతీ అయిన రంపచోడవరానికి రూ.53 లక్షల పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉండిపోయాయి. రంపచోడవరం పంచాయతీకి ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ గృహాల నుంచి ఇప్పటి వరకు రూ. 53,74,241 పన్ను బకాయిలు వసూలు కావాల్సి ఉంది. వీటిలో ప్రభుత్వ శాఖల నుంచి రూ. 14,11,315 వసూలు కావలసి ఉంది. నియోజకవర్గం కేంద్రం కావడంతో ఇక్కడ పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ క్వార్టర్లు ఎక్కువగా ఉన్నాయి. రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో ఎ, బి , సి అనే మూడు రకాల క్వార్టర్లు ఉన్నాయి. ఐటీడీఏ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు నివాసం ఉండేందుకు వీటిని నిర్మించారు. ఐటీడీఏ నుంచి సరైన నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో రాను రాను ఎవరు పడితే వారు ఈ క్వార్టర్లలో నివాసముంటున్నారు. ఐటీడీఏ క్వార్టర్ల నుంచి రూ.4,80,124 పన్ను వసూలు కావలసి ఉంది. టెలికాం భవనానికి సంబంధించి రూ.30,336, ఐటీడీఏ కార్యాలయ సముదాయం నుంచి రూ.14,321, సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి రూ.23,863, పీఎంఆర్‌సీ నుంచి రూ.2,52,818, పీఎంఆర్‌సీ నూతన క్వార్టర్స్ నుంచి రూ.1,80,860, పన్ను వసూలు కావాల్సి ఉంది. గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలు, పాఠశాలల క్వార్టర్లకు సంబంధించి రూ.53,006 పన్ను బకాయిలు వసూలు కావలసి ఉంది. రంపచోడవరంలోని పోలీస్‌శాఖకు చెందిన క్వార్టర్స్, అటవీ శాఖకు చెందిన భవనాలు, ఎంపీడీవో కార్యాలయం భవనాలకు పన్నులు చెల్లించాల్సి ఉంది. పాడేరు విడిజన్‌లో రూ.1.30 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉంది. ఈ మొత్తం ప్రభుత్వ కార్యాలయాల నుంచి వసూలు కావాల్సి ఉంది.
పది శాతం పెంచి పన్నులు వసూలు చేస్తాం
పన్ను బకాయిలు ఎక్కువగానే ఉన్నాయి. సెప్టెంబర్ నుంచి పన్నులు వసూలుకు చర్యలు చేపడతాం. పదిశాతం పెంచి పన్ను వసూలు చేస్తాం. రోడ్ల ఆక్రమణల కారణంగా రంపచోడవరంలో చాలా వరకు షాపులను తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఏరియాను బట్టి పన్ను విధించాల్సి ఉంటుంది. పన్ను వసూళ్లపై దృష్టి సారించి పంచాయతీలకు నిధులను సమకూర్చేందుకు కృషి చేస్తాం.
–కోటేశ్వరరావు,
డీఎల్‌పీవో,రంపచోడవరం
చింతూరు డివిజన్‌లో...
చింతూరు డివిజన్‌లో 66 పంచాయతీలున్నాయి. చింతూరు పంచాయతీ పరిధిలో ఉన్న 69 ప్రభుత్వ శాఖలు తొమ్మిదేళ్ల కాలంలో రూ. 39,10,932 పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా చింతూరు ఐటీడీఏ పీవో బంగ్లా పన్ను బకాయి రూ.79,821, ఉపఖజానా కార్యాలయం రూ.37,242, చింతూరు తహసీల్దార్ కార్యాలయం రూ.1,01,502, ఐటీడీఏ కార్యాలయం రూ.2,69,865 పన్ను బకాయి చెల్లించాల్సి ఉంది. వివిధ రకాలైన క్వార్టర్లకు పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంది. పంచాయతీలకు పన్ను బకాయిలు సక్రమంగా చెల్లించకపోవడంతో పంచాయతీల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు నిధుల కొరత ఏర్పడుతోంది. పలు ప్రైవేట్ అతిఽథి గృహాల నుంచి పన్నులు సక్రమంగా వసూలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.

పంచాయతీలకు పన్ను నొప్పి