చలివేంద్రాలు ఏర్పాటు చేయండి
పాడేరు : అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో గ్రామాల్లో విరివిగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు సమస్యలపై ఆయనతోపాటు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, డీఆర్వో పద్మలత 75 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారపు సంతల్లో ఆశీలు వేలం పాడుకున్న కాంట్రాక్టర్లతో షేడ్ నెట్లు ఏర్పాటు చేయించాలని సూచించారు. వర్షపు నీటిని సంరక్షించాలని డ్వామా పీడీని ఆదేశించారు. రోడ్డుకు ఇరువైపులతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, తదితర చోట్ల మొక్కలు నాటాలన్నారు. వేసవి దృష్ట్యా వారపు సంతల్లో వైద్య శిభిరాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్యఘర్ సోలార్ విద్యుత్ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా కృషి చేయాలని ఆశాఖ అధికారులను ఆదేశించారు. ప్రతి నెల మూడో శనివారం కచ్చితంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. అనంతరం జాతీయ డెంగ్యూ దినోత్సవం ఫ్లెక్సీని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమలో డీఎంహెచ్‌వో డాక్టర్ జమాల్‌బాషా, గిరిజన సంక్షేమ శాఖ ఇన్‌చార్జి డీడీ రజనీ, ఐటీడీఏ ఏవో హేమలత, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ జవహర్‌బాబు పాల్గొన్నారు.
కలెక్టర్ దినేష్‌కుమార్ ఆదేశం
మీకోసంలో 75 వినతుల స్వీకరణ
చలివేంద్రాలు ఏర్పాటు చేయండి


