మరిన్ని కంపెనీలు వస్తే రెండో టవర్‌ | - | Sakshi
Sakshi News home page

మరిన్ని కంపెనీలు వస్తే రెండో టవర్‌

Nov 12 2026 12:13 AM | Updated on Nov 12 2026 12:13 AM

ఆదిలాబాద్‌ ఐటీ హబ్‌ను మోడల్‌గా తీర్చిదిద్దుతాం

సీసీఐ ఏర్పాటు కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తాం

ఐటీ టవర్‌ ప్రారంభోత్సవంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

సాక్షి,ఆదిలాబాద్‌: మరిన్ని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఆదిలాబాద్‌లో సేవలు అందించేందుకు వస్తే రెండో టవర్‌ చేపడతామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో నూతన ఐటీ టవర్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. స్థానిక ప్రజాప్రతినిధులు మరో ఐటీ టవర్‌ ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని కోరగా, ఆయన పైవిధంగా స్పందించారు. ఐటీ రంగంలో ఆదిలాబాద్‌ను ముందుంచుతామని స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు. ఇండస్ట్రీయల్‌ కారిడార్‌లో భాగంగా 3వేల ఎకరాల భూసేకరణ చేస్తున్నామని అన్నారు. త్వరలో హైదరాబాద్‌లో జరిగే సమ్మిట్‌లో ఆదిలాబాద్‌ ఇండస్ట్రీయల్‌ కారిడార్‌లో కంపెనీల ఏర్పాటుకు సంబంధించి అవకాశం కల్పించేలా చూస్తామని వివరించారు. వివిధ ఆవిష్కరణల కోసం ఆదిలాబాద్‌ ఐటీ టవర్‌లో ఇంక్యుబేషన్‌ హౌస్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కంపెనీల్లో సేవలు అందిస్తున్న ఐటీ నిపుణులకు నైపుణ్యం మెరుగుపర్చుకునేందుకు టాస్క్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్‌టీ ల్యాబ్‌, బీడీఎన్‌టీ, వైడర్‌ తదితర కంపెనీల ద్వారా 300 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. నైపుణ్యం ఉన్నవారికి స్థానికంగా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఐటీ హబ్‌ను మోడల్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. మరిన్ని కంపెనీలను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ఏర్పాటుతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు. సీసీఐ పునఃప్రారంభం కోసం కేంద్రంతో కలిసి పనిచేస్తామని వివరించారు. అంతకుముందు ఆదిలాబాద్‌ ఎంపీ గొడం నగేశ్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం వెనుకబడిందని తెలిపారు. ఇక్కడ పరిశ్రమలను నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం సబ్సిడీ అందించాలన్నారు. జిల్లాను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ మాట్లాడుతూ నిర్మల్‌ జిల్లాలో ఐటీ టవర్‌ నిర్మించాలని మంత్రిని కోరారు. నాన్‌టెక్నికల్‌ పోస్టులను గిరిజనులకు కేటాయించాలని పేర్కొన్నారు. అలాగే యూనివర్సిటీని ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్‌, కాంగ్రెస్‌ ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస రెడ్డి, బోథ్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్‌, సీనియర్‌ నాయకులు గండ్రత్‌ సుజాత, సాజిద్‌ ఖాన్‌, ఆదిలాబాద్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement