ప్రొసీడింగ్స్ లేకుండానే ఆగమేఘాల మీద పనులు రెండేళ్లుగా జాడలేని ప్రత్యేక అభివృద్ధి నిధులు అప్పుల ఊబిలో నాయకులు
బోథ్ నియోజకవర్గంలోని ఓ మండలంలో తమ లీడర్ చెప్పాడని ఏడాది క్రితం రూ.5 లక్షల పనులు పూర్తి చేశాడు ఓ ద్వితీయశ్రేణి నాయకుడు. అయితే ఇప్పటి వరకు ప్రొసీడింగ్ లేదు, బిల్లులు లేవు. పనులు అప్పజెప్పిన లీడర్ చుట్టూ తిరుగుతున్నా ఎలాంటి పురోగతి లేదు. ప్రభుత్వం నిధులు కేటాయింపులు చేయకపోవడంతో ఆ లీడర్ సైతం ఏమీ చేయలేని పరిస్థితి.
బోథ్ నియోజకవర్గంలోని మరో మండలంలో వీధుల్లో హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. ఎస్‌డీఎఫ్ వచ్చాక బిల్లులు వస్తాయని పెద్ద లీడర్ చెప్పడంతో ద్వితీయ శ్రేణి నాయకులు లైట్లను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటి వరకు నిధులు రాకపోవడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బోథ్: పనులు మొదలుపెట్టండి.. త్వరలోనే ఎస్‌డీఎఫ్ కింద నిధులు వస్తాయి.. అంటూ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, ఆయా పార్టీల నేతల మాటలు నమ్మిన అనుచరగణం ఇప్పుడు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. నిబంధనల ప్రకారం రావాల్సిన అధికారిక ఉత్తర్వులు (ప్రొసీడింగ్స్) చేతికి రాకుండానే గ్రామాల్లో ముందస్తుగా సిమెంట్ రోడ్లు వేశారు.. భవనాలు నిర్మించారు. ఇతరత్రా పనులు సైతం చేశారు. తీరా పనులు పూర్తయి ఏళ్లు గడుస్తున్నా.. అటు ప్రొసీడింగ్స్ లేవు, ఇటు నిధుల అతీగతీ లేదు. ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన ప్రత్యేక అభివృద్ధి నిధులు సైతం రెండేళ్లుగా రాకపోవడంతో బిల్లులు అందక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక వారు అవస్థలు పడుతున్నారు.
అనుమతులు శూన్యం..
ఏదైనా ప్రభుత్వ అభివృద్ధి పని జరగాలంటే మొదట పాలనాపరమైన అనుమతులు, సాంకేతిక మంజూరు, అధికారిక ప్రొసీడింగ్స్ తప్పనిసరి. ఆ తర్వాతే టెండర్లు లేదా నామినేషన్ పద్ధతిన పనులు ప్రారంభించాలి. కానీ జిల్లాలో మాత్రం వేరేలా సాగింది. గ్రామాల్లో తమ పట్టు నిలుపుకోవాలని, పార్టీలో మార్కులు కొట్టేయాలన్న అత్యుత్సాహంతో కొందరు నిబంధనలను గాలికి వదిలేశారు. చేతిలో ప్రొసీడింగ్స్ కాపీ లేకుండానే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ భవనాలు చకచకా నిర్మించేశారు. తీరా పనులు పూర్తయ్యాక కొలతలు నమోదు చేసేందుకు అధికారులు నిరాకరిస్తుండటంతో, ఇప్పుడు నిబంధనల ఉల్లంఘన తమ మెడకే చుట్టుకుందని తలలు పట్టుకుంటున్నారు. అసలు కాగితం లేకుండా పనులు చేయడం మా తప్పే.. నాయకుల మాట నమ్మి బలైపోయాం అని క్షేత్రస్థాయిలో వాపోతున్నారు.
రెండేళ్లుగా ఎస్డీఎఫ్ జాడ కరువు
జిల్లా ఇన్‌చార్జి మంత్రి ద్వారా నియోజకవర్గాలకు రూ.10 కోట్లు విడుదలయ్యే ఎస్డీఎఫ్ నిధులను స్థానిక ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు తమ అనుచరులకు పనుల రూపంలో కేటాయించడం ఆనవాయితీ. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2023–24 సంవత్సరానికి గాను నిధులు మంజూరయ్యాయి. వెంటనే పనులు చేపట్టి బిల్లులు విడుదల చేశారు. ఈ క్రమంలోనే 2024–25, 2025–26 సంవత్సరాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీల భరోసాతో ప్రొసీడింగ్ లేకుండానే తమ అనుచరులు పనులు మొదలుపెట్టారు. అయితే రెండేళ్లుగా ప్రభుత్వ ఖజానా నుంచి ఎస్డీఎఫ్ జిల్లాకు విడుదల కాలేదు. పూర్తి చేసిన పనులకు బిల్లులు నిలిచిపోగా, కొత్త పనులకు సైతం మోక్షం లేకుండా పోయింది.
గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి
రోడ్డు వేయిస్తా.. భవనం కట్టిస్తా అని ఎన్నికల ముందు, ఆ తర్వాత ప్రజలకు హామీలు గుప్పించిన నా యకులు ఇప్పుడు గ్రామాల్లోకి అడుగుపెట్టలేని పరి స్థితి. కొన్ని గ్రామాల్లో అరకొరగా మొదలుపె ట్టిన పనులు నిధులు లేక అర్ధంతరంగా నిలిచిపోయాయి. పూర్తి చేసిన పనులకు బిల్లులు రాకపోగా, అసంపూర్తి పనులతో ప్రజలు నిత్యం నిలదీస్తుండటంతో వారు గ్రామాలకు వెళ్లడమే మానేశారు.


