సెమిస్టర్‌కు స్వస్తి | - | Sakshi
Sakshi News home page

సెమిస్టర్‌కు స్వస్తి

Nov 3 2026 1:03 AM | Updated on Nov 3 2026 1:03 AM

పాలిటెక్నిక్‌లో వార్షిక విధానం ఈ విద్యాసంవత్సరం నుంచే అమలు ఆమోదం తెలిపిన రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ తెలుగు మీడియం విద్యార్థులకు ప్రయోజనం

బెల్లంపల్లి: పాలిటెక్నిక్‌ ప్రథమ సంవత్సరంలో వార్షిక పరీక్షల విధానం ప్రవేశపెట్టడానికి రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన ఇటీవల ఆమోదం తెలిపారు. తాజాగా తీసుకున్న సానుకూల నిర్ణయం వల్ల గ్రా మీణ నేపథ్యం కలిగి తెలుగు మాధ్యమంలో చది విన విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఉమ్మ డి ఆదిలాబాద్‌ జిల్లాలో బెల్లంపల్లి, సీసీసీ నస్పూర్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌లో ప్రభుత్వ ప్రైవేటు పాలిటెక్ని క్‌ కళాశాలలు ఉన్నాయి. వాటిలో దాదాపు 2 వేలకు పైగా ప్రథమ సంవత్సరం విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 2027 ఏప్రిల్‌ 8 నుంచి 17 వరకు విద్యార్థులు వార్షిక పరీక్షలు రాయనున్నారు.

విద్యార్థులు ఇబ్బందులు పడవద్దని..

పాలిటెక్నిక్‌ కోర్సుల్లో 90 శాతం మంది గ్రామీణ నేపథ్యం కలిగిన విద్యార్థులు చేరుతున్నారు. వారి విద్యాభ్యాసం పదోతరగతి వరకు తెలుగు మాధ్యమంలో కొనసాగుతుంది. పాలిటెక్నిక్‌ కోర్సులో చేరిన తర్వాత నాలుగున్నర నెలలకే ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలు ఆంగ్ల మాధ్యమంలో రాయడానికి విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సబ్జెక్టును అర్థం చేసుకోవడానికి సతమతమవుతున్నారు. ఈ క్రమంలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్‌ పరీక్షలు ఎత్తివేయాలని రాష్ట్ర సాంకేతిక విద్య కమిషనర్‌కు వినతులు వెల్లువెత్తాయి. దీంతో సెమిస్టర్‌ పరీక్షలను రద్దుచేసి వార్షిక పరీక్షలు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో ఏడాదికి రెండుసార్లు సెమిస్టర్‌ పరీక్షలు రాయడం తప్పడంతో పాటు ఆ వ్యవధిలో అప్పటి వరకు ఆంగ్ల మాధ్యమంపై కాస్త పట్టు సాధించి విద్యార్థులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా పరీక్షలు రాస్తారనే అభిప్రాయంతో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ఏకీభవించింది.

ప్రయోజనాలు

ఇప్పటి వరకు విద్యార్థులు కోర్సులో చేరిన నాలుగున్నర నెలలకే సెమిస్టర్‌ పరీక్షలు నిర్వహించేవారు. సబ్జెక్టులు అర్థం కాకముందే పరీక్షలు వచ్చేవి. ఇకనుంచి ఏడాది పాటు సమయం దొరకడంతో ప్రశాంతంగా చదవడంతో పాటు పరీక్షలు రాయడానికి విద్యార్థులకు వీలు కలుగనుంది. పదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివి, పాలిటెక్నిక్‌లో ఒక్కసారిగా ఇంగ్లీషులో పరీక్షలు రాయాల్సి వచ్చేది. వార్షిక పరీక్షల విధానంతో ఇంగ్లిష్‌ టెక్నికల్‌ పదాలకు అలవాటు పడేందుకు సమయం దొరుకుతుంది. తక్కువ సమయంలో సిలబస్‌ పూర్తికాక ఫెయిల్‌ అయి చదువు మానేస్తున్న గ్రామీణ విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంపై పాలిటెక్నిక్‌ విద్యార్థుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement