6 వరకే కడెం నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

6 వరకే కడెం నీటి విడుదల

Nov 3 2026 1:03 AM | Updated on Nov 3 2026 1:03 AM

కడెం: కడెం ప్రాజెక్టు ఆయకట్టుకు ఈనెల 6 వరకే సాగు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఈఈ ప్రవీణ్‌కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 7 నుంచి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్‌లో తాగునీటి అవసరాల దృష్ట్యా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆయకట్టు రైతులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

మేకను దొంగిలించిన

ఇద్దరి అరెస్ట్‌

తానూరు: మేక దొంగిలించిన ఇద్దరిని సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్సై షేక్‌ జుబేర్‌ తెలిపారు. గత నెల 28న రాత్రి మహారాష్ట్రలోని హుండ తండ గ్రామానికి చెందిన జాదవ్‌ శిరీష్‌, శ్రీనివాస్‌ ద్విచక్రవాహనంపై వచ్చి తానూరులో పవార్‌ మాణిక్‌ ఇంటి ముందు కట్టి ఉంచిన మేకను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ద్విచక్రవాహనం నంబర్‌ సాయంతో నిందితులను పట్టుకున్నారు. నాలుగు నెలల క్రితం తానూరులో మరో మేకను ఎత్తుకెళ్లినట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

సీఎస్సీ నిర్వాహకుడు అరెస్ట్‌

ఇచ్చోడ: మండల కేంద్రంలోని సిరిచెల్మ చౌరస్తాలో కస్టమర్‌ సర్వీస్‌ సెంటర్‌ (సీఎస్సీ) నిర్వాహకుడు ఆడే కై లాస్‌ను సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని జల్దా గ్రామానికి చెందిన కై లాస్‌ సీఎస్సీని అడ్డుగా పెట్టుకుని అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజలనుంచి అధిక వడ్డీ వసూలు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాంక్‌ పాసుపుస్తకంతో పాటు డిపాజిట్‌ రసీదులు, నకిలీ రబ్బరు స్టాంప్‌ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

మోసగించిన వ్యక్తి

రిమాండ్‌

ఆదిలాబాద్‌టౌన్‌: స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశచూపి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసి తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తిని సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్‌టౌన్‌ సీఐ సునీల్‌ కుమార్‌ తెలిపారు. ఉట్నూర్‌ మండలం లక్కారంలోని నవోదయ కాలనీకి చెందిన సయ్యద్‌ జావిద్‌ స్టాక్‌ మార్కెట్లో డబ్బులు పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశ చూపి పలువురి వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఇచ్చిన డబ్బుల్లో నుంచి లాభం వచ్చిందని కొంత నగదు వారికి ఇచ్చి నమ్మించాడు. వారి నుంచి తీసుకున్న డబ్బులు సొంత ఖర్చులకు వాడుకున్నాడు. బాధితులకు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడంతో ఆదిలాబాద్‌ పట్టణంలోని ఖానాపూర్‌కు చెందిన వసీమ్‌ కోకర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడిపై ఉట్నూర్‌తో పాటు టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కూడా కేసులు ఉన్నట్లు సీఐ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement