ఉట్నూర్‌రూరల్: ప్రజావాణి దరఖాస్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీవో మంద మకరందు ఆదేశించారు. సోమవారం ఐటీడీఏ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జైనూర్ మండలం జాడుగుడకు చెందిన మోతీరాం బావి, టెంట్‌హౌస్ మంజూరు చేయాలని, వాంకిడి మండలం దహెగాంకు చెందిన సిడాం చిత్రు ట్రాక్టర్ ఇప్పించాలని, నార్నూర్ మండలం చేతగూడకు చెందిన హరిచంద్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, తలమడుగు మండలం భీంపూర్‌కు చెందిన భూమారెడ్డి పట్టా మంజూరు చేయాలని దరఖాస్తులు అందజేశారు.
జనజాతి గౌరవ్ దివస్ పక్వాడా ప్రారంభం
స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజనుల ఆరాధ్య దైవం ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 1 నుంచి 15 వరకు జనజాతి గౌరవ్ దివస్ పక్వాడా నిర్వహిస్తున్నట్లు పీవో ఐటీడీఏ మంద మకరందు తెలిపారు. తన చాంబర్‌లో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు బిర్సాముండా చేసిన పోరాటం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ వసంతరావు, ఏపీవో పీవీటీజీ భాస్కర్, ఓఎస్డీ రాజ్‌కుమార్, డీడీ అశోక్, ఈఈ తానాజీ, డిప్యూటీ ఏవో చందన్, జేడీఎం నాగభూషణం, డీఈ నవీన్ పాల్గొన్నారు.


