చెన్నూర్‌రూరల్: గొర్రెలు, మేకల పెంపకందారులు చలికాలంలో మూగజీవాల పెంపకంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, లేనిపక్షంలో వ్యాధులు సోకే ప్రమాదం ఉందని కత్తెరసాల పశువైద్యాధికారి సతీష్ సూ చించారు. చలికాలంలో జీవాలకు ముఖ్యంగా పి.పిఆర్(పారుడు), ఆర్స్, మశూచి వ్యాధులు సోకుతాయి. వ్యాధి సోకిన జీవాలు మందలో ఉంటే మిగతా వాటికి కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.
కీటకాల బారి నుంచి కాపాడుకోవాలి
దోమలు, కీటకాల బారి నుంచి గొర్రెలు, మేకలను రక్షించి వాటికి నీలి నాలిక వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చలికాలంలో (సర్వ) తిక్క రోగం ప్రభావంవాటిపై ఎక్కువగా చూపుతుంది. నదీ పరీవాహక ప్రాంతాల్లో సంచరించే జీవాలకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతుంది. దోమకాటు ద్వారా సోకే ఈ వ్యాధిని గుర్తించకపోతే జీవి మృతి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాధుల బారినుంచి మూగజీవాలను కాపాడుకునేందుకు పెంపకందారులు ప్రతీరోజు సాయంత్రం పాకలు, మందల వద్ద వేపాకు ధూపం వేయాలి. రాత్రి పూట మంద వద్ద మంట ఏర్పాటు చేస్తే వ్యాధులు సోకకుండా కాపాడుకోవచ్చు. చలి బారి నుంచి రక్షణకు పాకలు ఏర్పాటు చేసి న్యూమోనియా(ఉమ్మి) వ్యాధి సోకకుండా కాపాడుకోవాలి.
మేత మేస్తున్న గొర్రెలు
సతీష్, పశువైద్యాధికారి, కత్తెరసాల


