సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆసిఫాబాద్‌లోని కుమురంభీం బెలూన్ థియేటర్ ప్రైవేట్ సంస్థ చేతుల్లోకి వెళ్లింది. నష్టాల సాకుతో జిల్లా మహిళా సమాఖ్య నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుని పిక్చర్ టైం సంస్థకు అప్పగించింది. ఇందుకు ఏడాదికి ఆ సంస్థ రూ.4.50 లక్షలు జిల్లా మహిళా సమాఖ్యకు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. దీంతో వారం రోజులుగా ఆ సంస్థ థియేటర్ నిర్వహణ చూస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో 2022 మార్చి 8న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జన్కాపూర్‌లో గల సర్కారు స్థలంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇందుకు మహిళా సమాఖ్య రూ.30 లక్షలు, పిక్చర్ టైం రూ.20 లక్షలు పెట్టుబడి పెట్టారు. 120 సీట్ల సామర్థ్యం గల ఎయిర్ బెలూన్, పోర్టబుల్ కంటైనర్, ఇన్‌ప్లేటబుల్ టెంట్ టెక్నాలజీతో థియేటర్ ఏర్పాటు చేశారు. ఇందులో మహిళా సమాఖ్య నుంచి నలుగురితోపాటు పిక్చర్ టైం వాళ్లూ పనిచేసేవారు. బెలూన్ థియేటర్ కొత్త అనుభూతిని ఇవ్వడంతో రెండేళ్ల క్రితం వరకు లాభాలు వచ్చాయి. క్రమంగా ప్రేక్షకుల ఆదరణ తగ్గడం, నిర్వహణ సరిగా లేకపోవడం, సినిమా పంపిణీదారులకు చెల్లించే మొత్తం పెంచడంతో ఆర్నెళ్ల క్రితం మూతబడింది. రూ.5 లక్షల వరకు విద్యుత్ బిల్లు పేరుకుపోయింది. దీనిపై థియేటర్ ఇన్‌చార్జి కుర్ర రాజ్‌కుమార్‌ను వివరణ కోరగా నష్టాలు రావడంతోనే ప్రైవేట్‌కు అప్పగించాల్సి వచ్చిందని తెలిపారు.


