ఖానాపూర్: పట్టణాల్లో మల్టీప్లెక్స్ తరహా సినిమా థియేటర్లు ఇప్పుడు పల్లె ప్రాంతంలోనూ అందుబాటులోకి వచ్చింది. ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలో ఇగ్లూ మోడల్‌లో ఏర్పాటు చేసిన థియేటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఖానాపూర్–మెట్‌పల్లి ప్రధాన రహదారి పక్కన ఉన్న థియేటర్ సినీప్రియులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. సుమారు 30 గుంటల స్థలంలో రూ.కోటికి పైగా వ్యయంతో 100 మంది కూర్చునే సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. ఏసీ, ఆధునిక సౌండ్ సిస్టమ్, సౌకర్యవంతమైన సీటింగ్ వంటి వసతులు కల్పించారు.
నాలుగు షోలు..ఆన్‌లైన్ బుకింగ్
రోజుకు నాలుగు షోలు, ప్రతీ ప్రేక్షకుడికి వీక్షణ అనుభూతి కలిగేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. క్యాంటీన్, ఆహ్లాద వాతావరణంతోపాటు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. బర్త్‌డేలు, మ్యారేజ్ డేలు, ఇతర కార్యక్రమాల కోసం థి యేటర్‌ను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
ప్రేక్షకులను అలరిస్తూ,..
పట్టణంలోని థియేటర్ 2019లో మూతపడటంతో స్థానికులు నిర్మల్, మెట్‌పల్లి తదితర పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేది. మస్కాపూర్‌లో 2023లో ఇగ్లూ థియేటర్ అందుబాటులోకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’సినిమాతో ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ‘ఇరుముడి’సినిమాతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఖానాపూర్, కడెం, పెంబి, దస్తురాబాద్, మామడ మండలాలతోపాటు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలాల ప్రజలకు స్థానికంగానే సినిమా వినోదం అందుబాటులోకి వచ్చింది.


