పత్తి చేనులో గంజాయి
బోథ్: పత్తి పంట మాటున గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న గంజాయి దందా గుట్టును బోథ్ పోలీసులు రట్టు చేశారు. మండలంలోని పట్నాపూర్ గ్రామ శివారులో శనివారం నిర్వహించిన దాడుల్లో రెండు వేర్వేరు పత్తి చేల నుంచి రూ.3.30 లక్షల విలువైన 33 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులపై కేసులు నమోదు చేశారు. ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్నాపూర్ శివారు వ్యవసాయ భూముల్లో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్నారన్న సమాచారంతో బోథ్ ఎస్సై వి. పురుషోత్తం సిబ్బందితో కలిసి శనివారం తనిఖీలు చేపట్టారు. గ్రామానికి చెందిన కొమ్రం రాములు (37) తన పత్తి చేనులో సాగు చేసిన 3 నుంచి 5 అడుగుల ఎత్తు గల 17 గంజాయి మొక్కలను గుర్తించి సీజ్ చేశారు. వీటి విలువ సుమారు రూ.1.70 లక్షలు ఉంటుందని అంచనా. అదేరోజు మధ్యాహ్నం పట్నాపూర్ శివారు మరో పత్తి చేనులో పోలీసులు దాడులు నిర్వహించారు. గుడిహత్నూర్ మండలం తాకిగూడకు చెందిన సిదం చిత్రు (50) ప్రస్తుతం పట్నాపూర్‌లో ఉంటూ తన బంధువు భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. గంజాయి తాగే అలవాటున్న చిత్రు.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో పత్తి చేను మధ్యలో గంజాయి సాగు చేయడం ప్రారంభించాడు. 4 నుంచి 5 అడుగుల ఎత్తు పెరిగిన 16 గంజాయి మొక్కలను (విలువ రూ.1.60 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి స్వాధీనం
కుభీర్: మండలంలోని నందపాడ్ సమీపంలో చేను పందిరిపై ఎండబెట్టిన గంజాయిని ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై క్రిష్ణారెడ్డి తెలిపారు. సుమారు 350 గ్రాములు గంజాయి ఉంటుందన్నారు. అడిషనల్ ఎస్పీ సాయికుమార్, సీఐ ప్రవీణ్‌కుమార్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. గంజాయి ఎవరిది అనేది నిర్ధారణ జరగలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


