జిల్లాలో
చౌక దుకాణాలు 356
రేషన్‌కార్డులు 2,27,570
కార్డుల్లోని సభ్యులు 7,44,737
కై లాస్‌నగర్: చౌకధరల దుకాణాల ద్వారా రేషన్‌కార్డు లబ్ధిదారులకు బియ్యంతో పాటు మరో ఆరు రకాల నిత్యావసర సరుకులు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఆ శాఖ అధికారులను ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పెరిగిన నిత్యావసరాల ధరలు పేదలకు భారంగా మారిన నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సర్కారు నిర్ణయం అమల్లోకి వస్తే జిల్లాలోని 2లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
ఎల్‌నినో ఎఫెక్ట్ అధిగమించేలా..
ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. వానాకాలం పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోగా, యాసంగి సాగు చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు చుక్కలనంటుతున్నాయి. పప్పుదినుసులు, వంటనూనెల పరిస్థితి అలాగే ఉంది. నిరుపేదల ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా మరో ఆరు సరుకులు అందించాలని భావిస్తోంది. ఇటీవల పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి సరుకుల పంపిణీ సాధ్యాసాధ్యాలు, ఆర్థికంగా ఎదురయ్యే భారం వంటి అంశాలపై అధ్యయనం చేసి నివేదిక సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో రేషన్ లబ్ధిదారుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
ఆరు సరుకులు..
ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సన్న బియ్యం ఉచితంగా అందజేస్తున్నారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇకపై బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర, చింతపండు, పామాయిల్, గోదుమపిండి, కారం పొడి వంటి సరుకులు అందించాలని భావిస్తోంది. అయితే వీటిని బియ్యం మాదిరిగానే ఉచితంగా అందజేస్తారా లేక మార్కెట్ కంటే తక్కువ ధరకు అందిస్తారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అలాగే ఒక్కో కుటుంబానికి ఆయా సరుకులను ఎంత పరిమాణంలో అందిస్తారానేది కూడా తెలియాల్సి ఉంది.
ప్రభుత్వ ఆదేశాలకు
అనుగుణంగా చర్యలు
రేషన్‌దుకాణాల ద్వారా పేదలకు నిత్యావసర సరుకులను అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే అధికారికంగా మాకెలాంటి ఆదేశాలు అందలేదు. ఏదైనా ఉత్తర్వులు అందితే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా జిల్లాలో వాటి పంపిణీపై తగు చర్యలు తీసుకుంటాం.
– ఎస్.నందిని, డీసీఎస్‌వో


