ఎండిపోతున్న వాగులు, చెరువులు
పడిపోతున్న భూగర్భజలాలు
అన్‌సీజన్‌లోనూ విద్యుత్ డిమాండ్
అక్టోబర్‌లోనే ఆందోళనకర పరిస్థితులు
అప్రమత్తం అవసరం అంటున్న నిపుణులు
సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన సూచనలు చూస్తే రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో అక్టోబర్‌లోనే తాగునీరు, విద్యుత్ ఇక్కట్ల జాడలు కనిపిస్తున్నాయి. వాగులు, చెరువులు ఎండిపోతుండగా.. భూగర్భజలాల మట్టాలు వేగంగా పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో తాగునీటికి గడ్డు పరిస్థితులు తలెత్తే అవకాశం లేకపోలేదు. ఇప్పటి నుంచే నీరు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకుంటేనే రాబోయే వేసవి గండాన్ని గట్టెక్కగలమని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు.
సగం చెరువుల్లో అరకొర నీళ్లే..
ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 309 చెరువులు ఉండగా, 5 చెరువుల్లో అసలు నీరే చేరలేదు. 50 శాతం చె రువుల్లో సగానికి మాత్రమే నీరు చేరగా, మిగిలిన చె రువులు 75శాతం వరకు నిండాయి. ప్రస్తుతం ఎండతీవ్రత పెరగడంతో చెరువులు ఎండిపోతున్నా యి. మరోవైపు అక్టోబర్‌లోనే భూగర్భ జలాలు 5.16మీటర్ల లోతుకు పడిపోయాయి. సాధారణంగా ఫిబ్రవరిలో భూగర్భ జలాలు ఈ స్థాయిలో పడిపోతాయి. తాజా పరిస్థితి గమనిస్తే రానున్న వేసవి లో నీటి కష్టాలు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
పెరిగిన విద్యుత్ డిమాండ్..
సాధారణంగా ఉష్ణోగ్రత తక్కువగా ఉండే అక్టోబర్‌లో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంటుంది. ఈ సారి వినియోగం మాత్రం రికార్డు స్థాయికి పెరిగింది. గతేడాదితో పోల్చితే దాదాపు 75 శాతం పెరగడం గమనార్హం. ఇదే కొనసాగితే రానున్న రోజుల్లో కరెంట్ కోతలు విధించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు తాగునీరు, విద్యుత్‌కే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, ఈసారి సాగుకు నీరు ఇవ్వడం కష్టమేనని సీఎం చేసిన వ్యాఖ్యలతో యంత్రాంగం, రైతులు అప్రమత్తమయ్యారు. నీటి వసతి ఉన్న వారు ఆరుతడి పంటలపై మొగ్గుచూపే అవకాశం ఉంది. మరోవైపు చెరువుల్లో అరకొర నీటి నిల్వలు, పడిపోయిన భూగర్భ జలాల నేపథ్యంలో సాగుకు గడ్డుకాలం తప్పేలా లేదు.
‘వచ్చే 8 నెలల పాటు ఇబ్బందికరంగా ఉంటుంది.. బయటకు రాలేని పరిస్థితులుంటాయి.. సాగునీరే కాదు తాగునీటికి ఇక్కట్లు ఏర్పడతాయి.. నీటితో పాటు విద్యుత్‌ను పొదుపుగా వాడాలి.. పశువులను జాగ్రత్తగా చూసుకోవాలి..’ ఈ నెల 24న సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో అన్నమాటలివి. – బోథ్


