సమన్వయంతోనే వన్యప్రాణుల సంరక్షణ
ఆదిలాబాద్‌టౌన్: వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు పోలీసు, అటవీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన కేసుల దర్యాప్తు, నిందితులపై చట్టపరమైన చర్యలు, కోర్టులో శిక్ష పడేలా అనుసరించాల్సిన విధానాలపై పోలీసు, అటవీ శాఖ అధికారులకు పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రెండు శాఖలు సమష్టిగా కృషి చేసినప్పుడే అడవుల్లో అక్రమ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో అరికట్టడం సాధ్యమవుతుందన్నారు. వన్యప్రాణులను వేటాడటం, అక్రమంగా కలప తరలించడం, మారుమూల ప్రాంతాల్లో గంజాయి సాగు వంటి అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. వన్యప్రాణుల కేసుల్లో నిందితులకు శిక్ష పడాలంటే పక్కా సాక్ష్యాధారాల సేకరణతో పాటు సమర్థవంతమైన దర్యాప్తు అవసరమని స్పష్టం చేశారు. యూనిఫాం గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందులో ఆదిలాబాద్ ఇన్‌చార్జి డీఎఫ్‌వో సుశాంత్ సుఖదేవ్, శిక్షణ ఐఎఫ్‌ఎస్‌లు, ఎఫ్‌ఆర్‌వోలు, డిప్యూటీ ఎఫ్‌ఆర్‌వోలు, రేంజ్ అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు, దర్యాప్తు అధికారులు, రైటర్లు, పోలీసు, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.


