కై లాస్‌నగర్: ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో పట్టణంలో నీటి ఎద్దడి, విద్యుత్ సమస్య తలెత్తకుండా ఇప్పటి నుంచే పొదుపు చర్యలు పాటించాలని అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, వాటర్ సర్వీసింగ్ సెంటర్లు, ఫంక్షన్ హాళ్లు, కార్పొరేట్ విద్యాసంస్థలు, షాపింగ్ మాల్స్, వాటర్ ప్లాంట్ల నిర్వాహకులతో మున్సిపల్ చైర్‌పర్సన్ అనూషతో కలిసి శనివారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యుత్ వినియోగం అధికంగా ఉన్న సంస్థలు తప్పనిసరిగా సోలార్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పట్టణానికి తాగునీటిని సరఫరా చేసే ఎస్సారెస్పీలో ప్రస్తుతం 36 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉందని తెలిపారు. ఈ నిల్వలు ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ తదితర ప్రాంతాలకు ఫిబ్రవరి, మార్చి వరకు మాత్రమే సరఫరాకు సరిపోయే అవకాశముందన్నారు. నీటి వినియోగంలో ప్రతి ఒక్కరూ పొదుపు పాటించాలని సూచించారు. వృథా చేసే సంస్థలపై భారీ చలానాలు, జరిమానాలతో పాటు నిబంధనల ప్రకారం యూనిట్లను సీజ్ చేసే అవకాశముందని హెచ్చరించారు. ఇందులో టీపీఎస్ నవీన్ కుమార్, డీఈ సందీప్, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ , విద్యుత్‌శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


