ప్రతిభ కనబరుస్తూ..పతకాలు సాధిస్తూ | - | Sakshi
Sakshi News home page

ప్రతిభ కనబరుస్తూ..పతకాలు సాధిస్తూ

Oct 24 2026 11:47 PM | Updated on Oct 24 2026 11:47 PM

● సత్తా చాటుతున్న ఉమ్మడి జిల్లా అథ్లెట్లు ● రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికల్లో రాణింపు ● ప్రభుత్వ కొలువులే లక్ష్యంగా ముందుకు..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా క్రీడాకారులు అథ్లెటిక్స్‌ పోటీల్లో సత్తా చాటుతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి వేదికలపై అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ పతకాలు సాధిస్తున్నారు. అథ్లెటిక్స్‌లో భవిష్యత్తు తారలుగా ఆశలు రేపుతున్నారు. ఇటీవల హన్మకొండ వేదికగా నిర్వహించిన 12వ తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లోనూ తమ క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించి ఔరా అనిపించారు. ఇలా పాల్గొన్న పోటీల్లో ప్రతిభ చాటుతూ క్రీడాకారులుగా రాణిస్తున్న ఉమ్మడి జిల్లా అథ్లెట్లపై ప్రత్యేక కథనం. –ఆదిలాబాద్‌

వరుస పతకాలతో..

ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం గిర్నూ ర్‌కు చెందిన అట్టం జస్వంత్‌ తండ్రి రమేశ్‌ గొర్రెల కాపరికాగా తల్లి విజయ గృహిణి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పదేళ్లుగా శిక్షణ పొందుతున్న ఈ యువ అథ్లెట్‌ రాష్ట్రస్థాయిలో ఐదు పతకాలు సాధించాడు. రెండు జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. హన్మకొండలో 5000 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం సాధించాడు. జాతీయస్థాయి పోటీల్లో పతకం సాధించడమే లక్ష్యం అంటున్నాడు.

జాతీయస్థాయిలో పతకమే లక్ష్యంగా..

ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం కూర గ్రామానికి చెందిన మార్శెట్టి విష్ణువర్ధన్‌ ఎనిమిదేళ్లుగా అథ్లెట్‌ రాష్ట్రస్థాయి పోటీల్లో రేస్‌ వాక్‌, హాఫ్‌ మారథాన్‌, స్టీపుల్‌చేజ్‌ విభాగాల్లో పాల్గొని బంగారు పతకాలు కై వసం చేసుకున్నాడు. హన్మకొండలో పురుషుల హాఫ్‌ మారథాన్‌ రేస్‌ వాక్‌ ఈవెంట్లో స్వర్ణంతో మెరిశాడు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న క్రీడాకారుడు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని పతకం సాధించడమే తన లక్ష్యమని చెబుతున్నాడు.

పీడీ కావడమే లక్ష్యం..

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని కేఆర్కే కాలనీకి చెందిన దివిటి అరుణ క్రీడలపై ఆసక్తితో ముందుకెళ్తోంది. తల్లిదండ్రులు రాజు, సరోజ దోబీ వృత్తి చేస్తూ కుమార్తెను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నారు. వారి ప్రోత్సాహం, శిక్షకుల మార్గదర్శకత్వంతో ఇప్పటి వరకు 11 పతకాలు సాధించింది. షూటింగ్‌ బాల్‌లో జాతీయస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించి ప్రతిభను చాటింది. హన్మకొండలో మహిళల హ్యామర్‌ త్రోలో వెండి పతకం సాధించింది. డిగ్రీ పూర్తి చేసిన అరుణ భవిష్యత్తులో ఫిజికల్‌ డైరెక్టర్‌గా ఎదగడమే తన లక్ష్యమని చెబుతోంది.

వాయుసేనలో చేరడమే

ధ్యేయంగా..

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం డొంగర్‌గావ్‌ గ్రామానికి చెందిన కనక గంగోత్రి అథ్లెటిక్స్‌ క్రీడల్లో శిక్షణ పొందుతూ రాష్ట్రస్థాయిలో రెండు పతకాలు సాధించింది. హన్మకొండలో అండర్‌–18 బాలికల లాంగ్‌ జంప్‌ ఈవెంట్లో కాంస్య పతకం సాధించింది. తల్లిదండ్రులు ఆనంద్‌, వచేల ప్రోత్సాహంతో క్రీడల్లో ముందుకు సాగుతోంది. ఇంటర్‌ చదువుతున్న గంగోత్రి భవిష్యత్‌లో భారత వాయుసేనలో చేరి దేశానికి సేవ చేయాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నానని చెబుతోంది.

ఉద్యోగం సాధించడమే టార్గెట్‌

నిర్మల్‌ జిల్లా ముధోల్‌ మండలం అష్టా గ్రామానికి చెందిన బలైగారి స్వాతి తల్లిదండ్రులు రాజశేఖర్‌, సుగుణ ప్రోత్సాహంతో క్రీడల్లో ముందుకెళ్తోంది. తండ్రి మలేషియాలో పనిచేస్తుండగా, తల్లి వ్యవసాయం చేస్తూ కుమార్తెను ప్రోత్సహిస్తోంది. ఐదేళ్లుగా అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందుతూ ఇప్పటివరకు రాష్ట్రస్థాయిలో మూడు పతకాలు సాధించింది. హన్మకొండ టోర్నమెంట్లో 1000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం కొల్ల గొట్టింది. డిగ్రీ పూర్తి చేసిన ఈ యువ క్రీడాకారిణి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన ధ్యేయమని చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement