ఇంద్రవెల్లి: గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని గిరిజన కుటుంబాలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. శనివారం ముందుగా మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కుమురంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పి ంచారు. అనంతరం మండలంలోని మల్లాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో విస్తారంగా లభించే సీతాఫలాలను సద్వినియోగం చేసుకొని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. సీతాఫలల నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్‌పై మహిళాలకు ప్రత్యేక శిక్షణ అందిస్తే అదనపు ఆదాయం పొందడంతో పాటు ఆర్థికంగా బలోపేతం కావడానికి అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, పీవీటీజీ ఏపీవో ఆత్రం భాస్కర్, ఆదివాసీ సంఘాల నాయకులు మెస్రం నాగ్‌నాథ్, గేడం భరత్, మల్లాపూర్ సర్పంచ్ కనక అనుసాయ, రైతులు పాల్గొన్నారు.


