ఖానాపూర్: పుట్టింది తెలంగాణ గడ్డపై.. పెరిగింది అమెరికాలో.. లక్ష్యం అమెరికా సైన్యంలో సేవ చేయడం.. ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి తన ప్రతిభను చాటుకున్నాడు నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సింగాపూర్ గ్రామానికి చెందిన పన్నెల విశ్వక్ తేజ్. అమెరికాలో స్థిరపడిన పన్నెల జనార్దన్–రూప దంపతుల పెద్ద కుమారుడైన విశ్వక్ తేజ్.. అమెరికా సైన్యానికి సాంకేతిక సహకారం అందించే విభాగానికి సంబంధించిన శిక్షణ పూర్తి చేసుకుని ప్రత్యేక గుర్తింపు పొందాడు. సుమారు 250 మంది సైనికులతో కూడిన శిక్షణ బృందంలో భారతీయ మూలాలున్న అమెరికన్‌గా విశ్వక్ తేజ్ ఒక్కరే ఉండటం విశేషం. ఆయన సాధించిన ఈ ఘనతకు కుటుంబ సభ్యులతో పాటు సింగాపూర్ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఖానాపూర్ నుంచి అమెరికా వరకు..
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం సింగాపూర్ గ్రామానికి చెందిన పన్నెల జనార్దన్–రూప దంపతులు సుమారు 23ఏళ్ల క్రితం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అయినా స్వగ్రామంతో తమ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఫోక్ సింగర్‌గా గుర్తింపు పొందిన జనార్దన్ రెండు దశాబ్దాలుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవాభావాన్ని చాటుకుంటున్నారు. తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని విశ్వక్‌తేజ్ క్రమశిక్షణ, పట్టుదలతో ముందుకు సాగాడు. అమెరికా సైన్యంలో సేవలందించాలనే లక్ష్యంతో అడుగులు వేశాడు. సైన్యానికి సాంకేతిక రంగంలో సహకారం అందించే విభాగానికి సంబంధించిన కఠిన శిక్షణ పూర్తి చేసి అనుకున్న లక్ష్యం సాధించాడు. సుమారు 250 మంది సైనికులతో కూడిన శిక్షణ బృందంలో భారతీయ మూలాలున్న అమెరికన్‌గా విశ్వక్ తేజ్ ఒక్కరే ఉండటం తమకు గర్వకారణమని ఆయన తల్లిదండ్రులు పేర్కొన్నారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన నేపథ్యంలో జార్జియా రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నట్లు వారు తెలిపారు. కాగా, స్వగ్రామంతో అనుబంధాన్ని కొనసాగిస్తూ విదేశాల్లో తమదైన ముద్ర వేస్తున్న ఈ కుటుంబం సాధించిన విజయంపై సింగాపూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
యువతకు స్ఫూర్తిదాయకం
పట్టుదల, క్రమశిక్షణ, లక్ష్యంపై స్పష్టత ఉంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని విశ్వక్ తేజ్ ప్రయాణం చాటిచెబుతోంది. ఖానాపూర్ మండలానికి చెందిన యువకుడు అమెరికా సైన్యంలో శిక్షణ పూర్తి చేసుకోవడం జిల్లా వాసులకు గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్‌లో విశ్వక్ తేజ్ మరిన్ని విజయాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగాలని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు ఆకాంక్షిస్తున్నారు.


