అంబులెన్స్‌ను ఎదురుగా ఢీకొట్టిన లారీ అనారోగ్యంతో బాధ పడుతున్న కూతురు, వెంట వెళ్తున్న తల్లి దుర్మరణం కడ్తాల్ జాతీయ రహదారి వద్ద ఘటన గాదిగూడ మండలం ఝరిలో విషాదం
నార్నూర్/లక్ష్మణచాంద: అనారోగ్యంతో బాధ పడుతున్న కూతురుతోపాటు ఆమెకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌కు వెళ్తున్న తల్లిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబలించింది. ఈ ఘటన బాధిత కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్చగా ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం ఝరి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. సోన్ ఎస్సై గోపి, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఝరి గ్రామానికి చెందిన మెస్రం సోము పటేల్ చెల్లి సరస్వతి (17) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. సరస్వతికి వారం రోజులు ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. తల్లి పారుబాయి (70) దగ్గరుండి సరస్వతి బాగోగులు చూసుకుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించాలని కుటుంబీకులు నిర్ణయించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి అంబులెన్స్‌లో సోముపటేల్, పారుబాయి సరస్వతిని హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ వై జంక్షన్ వద్ద అర్ధరాత్రి లారీని అతివేగంగా, అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ రాంగ్ రూట్‌లో వీరు ప్రయాణిస్తున్న అంబులెన్స్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పారుబాయి, సరస్వతి అక్కడికక్కడే మృతి చెందారు. అంబులెన్స్ డ్రైవర్ సాయికిరణ్‌తోపాటు సరస్వతి కుటుంబ సభ్యులైన సోము, గీత, తూమురం సాయిలుకు బలమైన గాయాలయ్యాయి. వీరు ప్రస్తుతం నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మద్యం మత్తులో లారీ డ్రైవర్ రాంగ్ రూట్‌లో వచ్చి అంబులెన్స్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. మృతురాలి అన్న సోము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తునట్లు సోన్ ఎస్సై గోపి తెలిపారు.


