లక్ష్మణచాంద: ఇంట్లోంచి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన సోన్ మండలం న్యూ వెల్మల్ గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యూవెల్మల్ గ్రామానికి చెందిన గొల్ల భోజన్న (57) గురువారం సాయంత్రం 4గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి వరకు తిరిగి రాలేదు. కుటుంబీకులు ఫోన్ చేయగా అతడి సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. చుట్టు పక్కలా వెతికినా, బంధువులకు ఫోన్ చేసి ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం భోజన్న కుమారుడు రాజశేఖర్ సోన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గోపి తెలిపారు.
కోర్టు ఆవరణలో ఆత్మహత్యాయత్నం
ఆదిలాబాద్‌టౌన్: జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి జిల్లా కోర్టు ఆవరణలో శుక్రవారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. చుట్టుపక్కల వారు గమనించి అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని లింబా(కె) గ్రామానికి చెందిన గోనె రాజు (35) కుటుంబాన్ని గతేడాది గ్రామపెద్దలు కులబహిష్కరణ చేసినట్లు తెలిసింది. భూ తగాదాల విషయంలో కుల పెద్దలు ఇచ్చిన తీర్పును రాజు కుటుంబం వ్యతిరేకించినట్లు సమాచారం. దీంతో ఆయనను బహిష్కరించడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించినట్లు తెలిసింది. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు చుట్టూ తిప్పుతున్నారని మనోవేదనకు గురైన రాజు న్యాయం జరగడం లేదని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఆత్మహత్యకు యత్నించిన ఆయనను కోర్టు ఆవరణలో ఉన్న పోలీసులు చికిత్స కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.


