లక్ష్మణచాంద: తమ కుటుంబానికి అండగా నిలవాలని ఉజ్వల భవిష్యత్ నిర్మించుకోవాలని ఎన్నో ఆశలతో ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన ఆ యువకుడు చివరకు విగతజీవిగా స్వగ్రామానికి చేరిన విషాద ఘటన సోన్ మండలం మాదాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. మాదాపూర్‌కు చెందిన తోకల తిరుపతి–పద్మ దంపతుల పెద్ద కుమారుడు ఆదిత్య(23) ఐదునెలల క్రితం ఉపాధి నిమిత్తం టర్కీ వెళ్లాడు. అక్కడ భవన పనులు చేస్తుండగా సెప్టెంబర్ 14న ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని సంప్రదించగా అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపి వైద్యసహాయం అందేలా ప్రయత్నించారు. అయితే మృత్యువుతో పోరాడిన ఆదిత్య ఈనెల 15న చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేలా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో సంప్రదించారు. ఎమ్మెల్యే చొరవతో మృతదేహం గురువారం గ్రామానికి చేరుకుంది. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపించిన తీరు అక్కడున్న వారందరినీ కంటతడి పెట్టించింది.


