బోథ్: పత్తిలో అంతర పంటగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ మండలంలోని నిగిని గ్రామానికి చెందిన లక్ష్మణ్ మడావి (51) తన వ్యవసాయ భూమిలో పత్తి పంట మధ్యలో గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులు సమాచారం అందింది. గురువారం వారు అక్కడి చేను వెళ్లి 40 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితుడికి గంజాయి తాగే అలవాటు ఉండటం, గతంలో కొనుగోలు చేసి వినియోగించిన అనంతరం మిగిలిన గంజాయి నుంచి విత్తనాలు సేకరించారు. తక్కువ సమయంలో అధిక డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో పత్తిలో గంజాయి సాగు చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈమేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. బోథ్ సీఐ డి.గురుస్వామి మాట్లాడుతూ గంజాయి సాగు, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


