సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మార్కెట్‌లో గురువారం పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10గంటలకు యార్డు ఆవరణలో వేలం ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందులో ప్రజాప్రతి నిధులు, రైతులు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, క మీషన్ ఏజెంట్లు పాల్గొననున్నారు. యార్డుకు వచ్చే బండ్ల నుంచి పత్తి సేకరించి దాని నాణ్యత పరిశీలించి రేటు నిర్ణయించనున్నారు. దీంతో పత్తి రైతుల దృష్టి మొత్తం వేలం పాటపైనే ఉంది. వేరే మార్కెట్‌లోలాగా ఇక్కడా ప్రైవేట్‌లో మంచి ధర దక్కుతుందా? లేదా? అనేది పరిశీలిస్తున్నారు. దీంతో నేడు మార్కెట్ యార్డుకు ఎన్ని పత్తి బండ్లు వస్తాయనే విషయం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మూడు స్లాట్ బుకింగ్‌లు మాత్రమే జరిగాయి.
ప్రైవేట్‌లో రేటు బేరీజు వేసుకుని..
స్లాట్ బుకింగ్‌లు నామమాత్రంగా జరగడం వెనుక రైతు పత్తిని విక్రయించే విషయంలో ఆచీతూచీ అడుగు ముందుకు వేస్తున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా మద్దతు ధరతో పత్తిని సీసీఐకి విక్రయించే సమయంలోనే రైతుకు స్లాట్ బుకింగ్ ఉపయోగపడుతుంది. ప్రైవేట్‌లో అంతకుమించి ధర ఉన్నప్పుడు నేరుగా వ్యాపారికి విక్రయించుకునేందుకు అవకాశముంటుంది. సాధారణంగా పత్తి తొలి తీత కొనసాగుతుండగా, మార్కె ట్ ప్రారంభం అవుతుందంటే అప్పటివరకు చేతికి అందిన పత్తిని విక్రయించడం ద్వారా కొంత ఆర్థిక వెసులుబాటు పొందుదామని రైతు భావిస్తుంటా డు. ఈసారి మాత్రం ప్రైవేట్‌లో రేటు అధికంగా ఉ న్నప్పటికీ ఆదిలాబాద్‌లో వేలం ఎలా సాగుతుంది.. ధర ఎంత నిర్ణయిస్తారు.. అనేది రైతు గమనిస్తున్నాడు. 8శాతం పైబడిన తేమ ఉన్న పత్తికి ప్రతీ అదనపు శాతానికి అధికారులు రూ.86.67 పైసలల చొప్పున కోత పెట్టనున్నారు. 12 శాతం తేమ మించితే సీసీఐ కొనుగోలు చేయమని చెబుతోంది.
వాతావరణ పరిస్థితులతో..
ఎల్‌నినో పత్తి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. నెలపాటు వర్షాలు లేక ఉష్ణోగ్రతలూ అధికంగా నమోదై ప్రస్తుతం చేతికి అందుతున్న పత్తిలో తేమ ఉండదనే అభిప్రాయం రైతుల్లో కనిపిస్తోంది. సాధారణంగా దిగుబడులు చేతికి అందిన తర్వాత ఎక్కడ చూసినా ఆరబెట్టడం కనిపించేది. ఇప్పుడు ఇంటో నే పత్తి కుప్పలు దర్శనమిస్తున్నాయి. కొనుగోళ్ల సందర్భంగా నాణ్యమైన పత్తి తెచ్చి మద్దతు ధర పొందాలని అధికారులు పదేపదే చెబుతున్నారు. ఇక్కడే వ్యాపారులు తమ జిమ్మిక్కులను ప్రదర్శించడం మార్కెట్‌లో పరిపాటిగా కొనసాగుతోంది. రైతులు తడిపిన పత్తిని తీసుకువచ్చి అధిక బరువు పొందా లని చూస్తారని ఆరోపిస్తూ దాని నాణ్యతపై ప్రశ్ని స్తూ ధరలో కోత పెడతారు. ఇలాంటి పరిస్థితుల్లోనే రైతు మార్కెట్‌కు తొలిరోజే పత్తి తీసుకువచ్చేందుకు సంకోచిస్తున్నాడనే అభిప్రాయం లేకపోలేదు.
నాణ్యమైన పత్తి తేవాలి
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో ఈ సీజన్ కు సంబంధించి పత్తి కొనుగోళ్లను గురువారం ఉదయం 10గంటలకు ప్రారంభిస్తున్నాం. సీసీఐతో పాటు ప్రైవేట్ వ్యాపారులు రంగంలో ఉండనున్నారు. రైతులు నాణ్యమై న పత్తిని మార్కెట్‌కు తేవాలి. ముందుగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి. కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ, మార్కెటింగ్, సీసీఐ, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలి.
– రాజర్షి షా, కలెక్టర్


