సారంగపూర్/దిలావర్పూర్: నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతర శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఆలయంలో అమ్మవారి ఆభరణాలను గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మూటగట్టారు. ఆలయ ఈవో భూమయ్య తలపై వాటిని పెట్టుకుని కాలినడక ప్రారంభించారు. దేవాదాయ శాఖ నిర్మల్ డివిజన్ ఇన్స్పెక్టర్ రంగు రవికిషన్గౌడ్, ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో 12 మంది సేవదారులు, 250 మంది పోలీసు బలగాల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య దిలావర్పూర్ మండలం సాంగ్వి గ్రామంలో గోదావరి నదికి తరలించారు. వీరి వెంట గ్రామాలకు చెందిన అధికసంఖ్యలో భక్తులు గడముంతలతో వెళ్లారు.
అడుగడుగునా హారతులు
అమ్మవారి ఆభరణాలను గంగస్నానం కోసం అడెల్లి, సారంగాపూర్, యాకర్పెల్లి, వంజర్, ప్యారమూర్ గ్రామాల మీదుగా దిలావర్పూర్ మండలంలోని మాటేగాం, దిలావర్పూర్, కంజర్, సాంగ్వి గ్రామాలకు చేరింది. అడుగడుగునా మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. గంగపుత్రుల సంప్రదాయ ప్రకారం చేపల పట్టే వలతో గొడుగులు వేసి అమ్మవారి ఆభరణాలకు పూజలు నిర్వహించారు. నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో ఆభరణాల భద్రతకు చర్యలు చేపట్టారు. దిలావర్పూర్కు చేరుకోగా సర్పంచ్ పాల్దె అక్షర అనిల్, వీడీసీ నాయకులు, గ్రామపెద్దలు పలువురు నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆభరణాలను సాంగ్వి పోచమ్మ ఆలయంలో ఉంచారు. భక్తుల జాగరణ అనంతర ఆదివారం వేకువజామున గోదావరిలో ఆభరణాలను శుద్ధి చేస్తారు. ఆ తర్వాత అడెల్లి ఆలయానికి తీసుకెళ్తారు.


