● నకిలీ ప్లింత్ ఏరియా సర్టిఫికెట్ తయారు చేసిన ఇద్దరి అరెస్ట్
నస్పూర్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పేరుతో కమిషనర్, సంబంధిత అధికారుల ఫోర్జరీ సంతకాలతో నకిలీ ప్లింత్ ఏరియా సర్టిఫికెట్లు తయారు చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై తౌసినొద్దీన్ తెలిపారు. శనివారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం..సీసీసీ నస్పూర్ తీగలపహాడ్కు చెందిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు. మంచిర్యాల భగవంతం వాడకు చెందిన గాదాసు శివకుమార్, బెల్లంపల్లి మున్సిపాలిటీలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఎండీ ఇర్ఫాన్లు కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ప్లింత్ ఏరియా సర్టిఫికెట్లు కావాలని దరఖాస్తు చేసుకున్న వారి వద్ద డబ్బులు తీసుకుని నకిలీ దందాకు తెరలేపారు. అధికారుల సంతకాలు ఫోర్జరీ, రబ్బర్స్టాంప్లు తయారు చేస్తున్న శివకుమార్, ఇర్ఫాన్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఇచ్చోడ సీఐని
సస్పెండ్ చేయాలి
నార్నూర్: సిరికొండ మండలం వాయిపేట్ గ్రామంలో ఆదివాసీ జాతిని కించపర్చేలా, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా మాట్లాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇచ్చోడ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామానికి చెందిన సుమారు 20 మందిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలన్నారు. ఆదివాసీ లపై అధికారులు వివక్షతో వ్యవహరించడం, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ గ్రామాల్లో ‘మావ నాటే మావరాజ్’అనే నినాదంతో బోర్డులు ఏర్పాటు చేయాలని గ్రామ పటేళ్లకు తుడుందెబ్బ జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది. సమావేశంలో తుడుందెబ్బ ఆదివాసీ విద్యార్థి సంఘం మండల గౌరవ అధ్యక్షుడు పెందోర్ కృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి కొట్నాక శ్రీరామ్, మండల నాయకుడు పూసం బాలాజీ, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ పెందోర్ చంపత్ తదితరులు పాల్గొన్నారు.


