ఆదిలాబాద్: రాష్ట్రస్థాయి జూనియర్ ఖోఖో చాంపియన్‌షిప్‌లో ఆదిలాబాద్ జిల్లా బాలురు, బాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన 45వ రాష్ట్రస్థాయి జూనియర్ ఖోఖో చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్ కై వసం చేసుకున్నాయి. బాలుర విభాగంలో ఆదిలాబాద్ జట్టు రంగారెడ్డి జిల్లా జట్టుపై 15 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. బాలికల విభాగంలో మహబూబ్‌నగర్ జిల్లా జట్టుపై 16 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రెండు విభాగాల్లోనూ ఆదిలాబాద్ జట్లు చాంపియన్‌షిప్ సాధించి జిల్లా ఖ్యాతిని చాటాయి. విజేతలకు ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, కార్యదర్శి కృష్ణమూర్తి కప్‌లు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఖోఖో అసోసియేషన్ కార్యదర్శి ఎన్. శ్రీధర్‌రెడ్డి, డీటీఎస్ఓ కె.పార్థసారథి, పి.కృష్ణ, శంకర్, కోచ్‌లు శివకృష్ణ, తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.


