బాసర: బాసర బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో శ్రీశారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఏడోరోజు సరస్వతి దేవి శ్రీకాళరాత్రి’ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారికి కిచిడి, వివిధ రకాల కూరగాయలతో ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యం సమర్పించారు.
గోదావరిలో భక్తుల పుణ్యస్నానాలు...
నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి భక్తులు బాసర క్షేత్రానికి తరలివస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మార్మోగింది.
శాస్త్రోక్తంగా కుమారిపూజ
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భగంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా కుమారి పూజ నిర్వహించారు. పదేళ్లలోపు బాలికలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు చేశారు. బాలికల పాదాలను పసుపు, నీటితో కడిగి, పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక అర్చనలు చేశారు. అనంతరం దేవస్థానం తరఫున ఈవో అంజనాదేవి, ఆలయ అర్చకులు బాలికలకు నైవేద్యం, తాంబూలం అందించారు.


