పట్నానికి రైట్‌.. పల్లెకు టైట్‌! | - | Sakshi
Sakshi News home page

పట్నానికి రైట్‌.. పల్లెకు టైట్‌!

Oct 18 2026 1:54 AM | Updated on Oct 18 2026 1:54 AM

● అరకొర బస్సులతో ఇక్కట్లు ● బస్టాండ్లలో తప్పని ఎదురుచూపులు ● అదనపు సర్వీసులు నడపాలని ప్రయాణికుల వినతి

ఆదిలాబాద్‌: దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి నడుస్తున్నాయి. హైదరాబాద్‌ వంటి నగరాల నుంచి పల్లెలకు పండుగకు వచ్చే వారి కోసం ఈనెల 9 నుంచి యాజమాన్యం ప్రత్యేక సర్వీసులను ప్రారంభించింది. అయితే స్పెషల్‌ సర్వీసుల నిర్వహణతో సాధారణ బస్సుల లభ్యత తగ్గి, జిల్లా, మండల కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గంటల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి. రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతూ సాధారణ సర్వీసులను యథావిధిగా కొనసాగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సాధారణ సర్వీసులకు ఇబ్బందులు

దసరా, బతుకమ్మ, శరన్నవరాత్రోత్సవాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నుంచి భాగ్యనగరానికి ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతోంది. రీజియన్‌ పరిధిలోని ఆరు డిపోల నుంచి మొత్తం 533 అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆదిలాబాద్‌ నుంచి 130, మంచిర్యాల నుంచి 154, నిర్మల్‌ నుంచి 144, ఆసిఫాబాద్‌ నుంచి 62, భైంసా నుంచి 31, ఉట్నూర్‌ నుంచి 31 సర్వీసులను నడుపుతున్నారు. పండుగ రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులను కేటాయించడంతో కొన్ని ప్రాంతాల్లో సాధారణ సర్వీసుల సంఖ్య తగ్గుతోంది. ముఖ్యంగా గ్రామీ ణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు సమయానికి బస్సులు అందక ఇబ్బందులు పడుతున్నారు.

సీట్ల కోసం ఆరాటం..

బస్సుల కొరతతో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తుండడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే సీట్ల కోసం హడావుడిగా బస్సులు ఎక్కడం, దిగే క్రమంలో ప్రయాణికులు గాయాల పాలవుతున్నారు. ఈ నెల 14న నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలో ఓ మహి ళ గాయపడిన విషయం తెలిసిందే. అయినప్పటి కీ అధికారులు ప్రత్యేక బస్సుల ఏర్పాటుపైనే దృష్టి సారిస్తూ, సాధారణ బస్సుల సంఖ్య పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రైవేటు ప్రయాణంతో ఛార్జీల భారం

బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా వారు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికులపై ఆర్థిక భారం పడుతోంది.

అదనపు బస్సులు నడిపితేనే..

సాధారణ సర్వీసులు తగ్గడంతో మహిళలు, వృద్ధులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. పండుగ రద్దీ నియంత్రించేందుకు ప్రత్యేక బస్సులు నడపడం అవసరమే అయినా, రోజువారీ ప్ర యాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఆర్టీసీపై ఉంది. అధికారులు స్పందించి సాధారణ సర్వీసులకు కోత పడకుండా సరిపడా బస్సులను అందుబా టులో ఉంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement