కార్పొరేషన్‌ పదవులపై ఆశలు | - | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌ పదవులపై ఆశలు

Oct 18 2026 1:54 AM | Updated on Oct 18 2026 1:54 AM

● జిల్లా కాంగ్రెస్‌ నేతల ప్రయత్నాలు ● అధిష్టానానికి జాబితా అందజేత ● రాష్ట్రస్థాయిలో చైర్మన్‌ దక్కేనా.. ? ● డైరెక్టర్‌, బోర్డ్‌ సభ్యుల కోసం కూడా

సాక్షి, ఆదిలాబాద్‌: రాష్ట్రంలో కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు సంబంధించి త్వరలో నామినేటెడ్‌ పదవులు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ అధిష్టానం పేర్కొంటుండగా, వాటిపై జిల్లా కాంగ్రెస్‌ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా జిల్లాకు సంబంధించి ప్రజా ప్రతినిధులుగా ప్రాతినిధ్యం లేకపోవడం, ప్రభుత్వ సమావేశాల నిర్వహణ సందర్భంగా ప్రొటోకాల్‌ సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో హస్తం నాయకులకు వేదికలపై కూర్చుండే అవకాశం దక్కడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి అంశాలను పూర్తిస్థాయిలో ప్రజలకు వివరించలేకపోతున్నామనే అభిప్రాయం పార్టీలో వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా నేతలకు రాష్ట్రస్థాయిలో సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వాలనే అభిప్రాయం జిల్లా పార్టీ నుంచి వ్యక్తమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కుల, సామాజిక వర్గాల సంక్షేమ కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు నామినేటెడ్‌ పద్ధతిలో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులను త్వరలో భర్తీ చేస్తామని పార్టీ అధిష్టానం పేర్కొంటుండగా, జిల్లా కాంగ్రెస్‌ నేతలు వాటిపై ఆశలు పెట్టుకున్నారు. జిల్లాకు సమచిత స్థానం కల్పిస్తేనే పార్టీ బలోపేతానికి పరిస్థితులు కలిసి వస్తాయని అధిష్టానానికి చెబుతున్నారు. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఏ రీతిన స్పందిస్తారో చూడాల్సిందే.

జాబితా అందజేత ..

కార్పొరేషన్‌ పదవులను త్వరలో భర్తీ చేయాలనే యోచనలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ జిల్లాల నుంచి ఆశావహుల జాబితాను సేకరిస్తుంది. జిల్లా నుంచి కూడా పేర్లను నాయకులు అందజేశారు. ఆ జాబితాలో 15కుపైగా పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది. ఆయా సామాజిక వర్గ సమీకరణాలతో పాటు పార్టీలో ముందు నుంచి ఉన్న పలువురు నాయకుల పేర్లు అందులో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ఎస్టీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎంపీ సోయం బాపురావు పేరుతో పాటు పలువురు సీనియర్‌ నాయకుల పేర్లు ఉన్నట్టు సమాచారం.

డైరెక్టర్‌, బోర్డు సభ్యులకు..

కార్పొరేషన్లలో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులతో పాటు డైరెక్టర్‌, బోర్డు సభ్యుల ను కూడా నియమిస్తారు. చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవుల కోసం ముఖ్య నాయకుల పేర్లను సూచించినప్పటికీ, ఒకవేళ డైరెక్టర్‌, బోర్డు సభ్యుల స్థానాల కోసం జిల్లా నుంచి కేటాయించాలనుకుంటే ద్వితీయ శ్రేణి నాయకుల పేర్లు కూడా కొన్ని సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌ పదవుల్లో మన జిల్లాకు ప్రాతినిధ్యం దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. వీటితోపాటు జిల్లా స్థాయిలో పీఏసీఎస్‌, ఇతరత్రా నామినేటెడ్‌ పదవుల భర్తీపై కూడా జిల్లా నాయకులు ఆశలు పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement