పైన రూ.16 నొక్కేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

పైన రూ.16 నొక్కేస్తున్నారు!

Oct 18 2026 1:54 AM | Updated on Oct 18 2026 1:54 AM

● చిల్లర పేరిట ‘చేయూత’లో కోత ● ప్రతి నెలా రూ.7లక్షల వరకు స్వాహా? ● నిలదీసిన లబ్ధిదారులకు ఇబ్బందులు

కై లాస్‌నగర్‌: వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, హెచ్‌ఐవీ బాధితులకు ఆసరాగా నిలువాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం కింద పింఛన్లు అందజేస్తోంది. దివ్యాంగులకు రూ.4,016ను అందిస్తుండగా, ఇతరులకు ప్రతి నెలా రూ.2,016 చొప్పున విడుదల చేస్తోంది. మున్సిపల్‌ పరిధిలో బ్యాంకుల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి మాత్రం పోస్టాఫీసు ద్వారా అందజేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారునికి పింఛన్‌ అందిస్తున్నందుకు గాను బీపీఎంలకు రూ.13 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే కొంతమంది బీపీఎంలు కాసులకు కక్కుర్తి పడుతున్నారు. పింఛన్‌ సొమ్ములోని పైన ఇచ్చే రూ.16ను నొక్కేస్తున్నారు. చిల్లర లేదనే సాకుతో కొందరు ఇవ్వడం లేదు. మరికొందరు ప్రయాణ ఖర్చులంటూ దండుకుంటున్నారు. ఎవరైనా ప్రశ్ని స్తే వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆన్‌లైన్‌ పనిచేయడం లేదని, తర్వాత రావాలంటూ పదే పదే తిప్పుకుంటున్నారు. లేదా కార్యాలయానికి వచ్చి తీసుకెళ్లాలని పేర్కొంటున్నారు. చేసేది లేక లబ్ధిదారులు ఇచ్చిన వాటినే తీసుకుంటున్నారు.

నెలకు రూ.7లక్షల వరకు స్వాహా

జిల్లావ్యాప్తంగా 71,507 మందికి ఆయా కేటగీరిల కింద ప్రభుత్వం పింఛన్లు అందిస్తోంది. నెలకు రూ.16కోట్ల 56లక్షల 10వేల 288 లను చెల్లిస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని 14,670 లబ్ధిదారులను మినహాయిస్తే 56,837 మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నారు. ఒక్కో పింఛన్‌ దారు నుంచి రూ.16 చొప్పున కాజేస్తున్నారు. ఒక ఊరిలో వంద నుంచి రెండు వందల మంది వరకు లబ్ధిదారులుంటే నెలకు రూ.2వేల నుంచి 3వేల సంపాదన అవుతుంది. మొత్తంగా లెక్కిస్తే నెలకు రూ.7,94,768లు స్వాహా అవుతున్నాయి. ఇందులో సగం మంది వరకు మినహాయింపు ఇచ్చినా సుమారు రూ.లక్షల్లోనే బీపీఎంల జేబుల్లోకి వెళ్తుండడం గమనార్హం.

లిఖితపూర్వకంగా

ఫిర్యాదు చేస్తే చర్యలు

ఎక్కడైనా బీపీఎంలు పింఛన్‌ సొమ్ములో కోత విధించినట్లయితే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలి. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం. పింఛన్‌ పంపిణీకి గాను ప్రభుత్వం వారికి ప్రత్యేక ప్రోత్సాహకం అందిస్తుంది. పింఛన్‌ సొమ్మును చిల్లర పేరిట ఇవ్వకపోవడం సరికాదు.

– జాదవ్‌ శేష్‌రావు, డీపీఎం, డీఆర్‌డీఏ

జిల్లాలో పోస్టాఫీసుల ద్వారా

పింఛన్‌ పొందుతున్న లబ్ధిదారులు

ఓఏపీ 22,415

వితంతు 22,042

దివ్యాంగులు 5,162

గీతకార్మికులు 36

చేనేత కార్మికులు 18

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement