పత్తి కొనుగోళ్లకు సన్నద్ధం
22న ఆదిలాబాద్ మార్కెట్లో ప్రారంభం
రంగంలో సీసీఐతో పాటు ప్రైవేట్ ట్రేడర్స్
17 నుంచి ‘కపాస్’ యాప్ అందుబాటులోకి
సాక్షి, ఆదిలాబాద్: పత్తి కొనుగోళ్లకు ముహూర్తం ఖ రారైంది. ఈనెల 22న ఆదిలాబాద్ వ్యవసాయ మా ర్కెట్యార్డులో అధికారికంగా ప్రారంభించనున్నా రు. సీసీఐతో పాటు ప్రైవేట్ వ్యాపారులు రంగంలో ఉండనున్నారు.గతేడాది మాదిరిగానే రైతులు ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అనంతర మే దిగుబడిని మార్కెట్కు తీసుకు రావాల్సి ఉంటుంది. ఈనెల 17 నుంచి కపాస్ కిసాన్యాప్ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
జిల్లాలో 11 కేంద్రాలు
సీసీఐ జిల్లాలో ఈ ఏడాది కూడా 11 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం 31 జిన్నింగ్లను అద్దెకు తీసుకుంది. రైతులు మార్కెట్ యార్డుల్లో పత్తి తూకం తర్వాత జిన్నింగ్కు తరలిస్తారు. ఆదిలాబాద్లో రెండు (ఏ,బీ సెంటర్లు), నేరడిగొండ, ఇంద్రవెల్లి, బేల, బోథ్, నార్నూర్, ఇచ్చోడ, సొనాల, పొచ్చెర, గుడిహత్నూర్లో ఒక్కో కేంద్రం చొప్పున అందుబాటులో ఉంటాయి. మొద ట ఆదిలాబాద్ మార్కెట్లో కొనుగోళ్లను ప్రారంభించిన తర్వాత జిల్లా అంతటా విస్తరించనున్నారు.
మద్దతు ధర మించి
ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో పత్తికి మద్దతు ధర మించి రేటు లభిస్తుంది. రూ.9వేలకు పైగా పలుకుతుండటం రైతులకు ఊరటనిస్తుంది. పొడవు గింజ పత్తి జిల్లాకు పెట్టింది పేరు. ఈ నాణ్యమైన దిగుబడికి ప్రైవేట్లో ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. మార్కెట్లో ఉదయం వేలం నిర్వహించి కొనుగో ళ్లను ప్రారంభిస్తారు. ఏ రోజుకారోజు పాట ఆధారంగా ధర ప్రకటిస్తారు. 8 నుంచి 12 శాతం లోపు తేమ ఉంటేనే మార్కెట్లో ఉన్న రేటు రైతులకు లభించే ఆస్కారముంది.
గతేడాది మాదిరే..
కపాస్ కిసాన్ యాప్ను ఈనెల 17నుంచి అందుబా టులోకి తీసుకురానున్నట్లు అధికారులుస్పష్టం చేశా రు. ఆ రోజు నుంచి రైతులు స్లాట్ బుకింగ్ చేసుకో వచ్చు. ముందుగా బుక్ చేసుకున్నవారు నిర్ణీత తేదీ లో విక్రయించుకోవచ్చు. ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత ఇది వరకు ఉన్న గడువు కంటే అదనపు రో జులు పెంచినట్లు కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. రైతులు సంబంధిత క్లస్టర్ పరిధిలోని రైతు వేదికల్లో అందుబాటులో ఉండే ఏఈవోలను సంప్రదించి స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు.
దిగుబడులతోనే దిగాలు..
ప్రస్తుతం మార్కెట్లో పత్తికి మంచి ధర ఉన్నప్పటికీ రైతుల్లో దిగుబడుల విషయంలోనే చింత నెలకొంది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఎకరానికి 8నుంచి పది క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని చెప్పినప్పటికి ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఎల్నినో ప్రభావంతో పంట ఎదుగుదల లోపించింది. దిగుబడిపై ప్రభావం చూపుతుంది. అంచనాలో సగం దిగుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవనే ఆవేదన రైతుల్లో కనిపిస్తుంది. ప్రస్తు తం పత్తి తీత ఇంకా ఊపందుకోలేదు. మొదటి రోజు మార్కెట్కు తీసుకువచ్చే పత్తిని బట్టి దిగుబడులను అంచనా వేసేందుకు ఆస్కారముంది.
సర్వం సిద్ధం
మరో వారం రోజుల్లో కొనుగోళ్లు ప్రారంభం కానుండగా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. సీసీఐ, ప్రైవేట్ వ్యాపారులకు సంబంధించి వేర్వేరుగా సాఫ్ట్వేర్ను రూపొందించింది. ఆదిలాబాద్ మార్కెట్యార్డులో 11 కాంటాలను రెడీ చేస్తున్నారు. యార్డులో రైతులకు కనీస వసతులు కల్పించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.
రూ.5కే భోజనం
రైతుల కోసం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రూ.5కే భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఇస్కాన్ సౌజన్యంతో అందుబాటులోకి తెస్తున్నారు. ఇందులో ఇస్కాన్ రూ.5 వెచ్చిస్తుండగా మార్కెటింగ్ శాఖ రూ.20 భరిస్తుంది. రైతు రూ.5 చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా మొదట్లో వెయ్యికి పైగా రైతులు పత్తిని విక్రయించేందుకు మార్కెట్కు వచ్చే పరిస్థితులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం..
ఈ నెల 22న పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సాఫ్ట్వేర్ సిద్ధం చేయడంతో పాటు తేమ కొలిచే యంత్రాలను అందుబాటులో ఉంచాం. రైతులు నాణ్యమైన పత్తిని తీసుకురావాలి. మంచి ధర పొందాలి.
– గజానంద్, మార్కెటింగ్ శాఖ ఏడీ


